Russia: ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశమంటూ ఏదీ ఉండదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్య ఒలెనా జెలెన్ స్కా భావోద్వేగ భరిత పోస్టు

Ukraine First Lady Emotional Note On Russia Invasion

  • అణు యుద్ధమంటూ పుతిన్ బెదిరిస్తున్నారని వ్యాఖ్య
  • తమకు ఆయుధ సాయం చేయాలని విజ్ఞప్తి
  • పిల్లలు బాంబ్ షెల్టర్లలో చదువుకుంటున్నారని ఆవేదన
  • బేస్ మెంట్లలో పేషెంట్లకు చికిత్స చేస్తున్నారంటూ ఆందోళన

రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్య జెలెన్ స్కా మండిపడ్డారు. ఉక్రెయిన్ కు జరుగుతున్న అన్యాయంపై ప్రపంచ దేశాలు నోరు విప్పాలని ఆమె కోరారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో వివిధ దేశాల ప్రథమ పౌరురాళ్లు మాట్లాడిన వీడియోలను ఆమె పోస్ట్ చేశారు. దాంతో పాటు భావోద్వేగభరితమైన కామెంట్లు చేశారు. 

ఉక్రెయిన్ కు ఎలాంటి సాయం చేయగలమంటూ వివిధ దేశాల ప్రథమ పౌరురాళ్లు అడుగుతున్నారని, ప్రపంచానికి నిజం చెప్పడమే వాళ్లు చేసే సాయమని జెలెన్ స్కా అన్నారు. రష్యా చెబుతున్నట్టు ఆ దేశం చేస్తున్నది సైనిక చర్య కాదని, పూర్తి స్థాయి యుద్ధమని ఆమె ఆరోపించారు. 

ఉక్రెయిన్ ను ఎవరూ కాపాడాల్సిన అవసరం లేదని, అయితే, తమకు సాయం మాత్రం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మాటలు కాకుండా సైనికులకు, పౌరులకు ఆయుధాలిచ్చి ఆదుకోవాలన్నారు. అణు యుద్ధానికి పుతిన్ తయారవుతున్నారన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాలన్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశమంటూ ఏదీ ఉండదన్నారు. 

యుద్ధం వల్ల పిల్లలు బాంబ్ షెల్టర్లలో చదువుకోవాల్సి వస్తోందని, పేషెంట్లకు బేస్ మెంట్లలో చికిత్స చేయాల్సి వస్తోందని, వాటిపై మాట్లాడాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యా ప్రచారకర్తలు, క్రెమ్లిన్ పత్రికలు ఏం కాదంటూ ఎన్ని హామీలిచ్చినా తమ పిల్లలు, పౌరులు చనిపోతూనే ఉన్నారన్నారు.  
 
రష్యాకు చెందిన వేలాది మంది చనిపోయారని, ఆ విషయాన్ని రష్యా దాచేస్తోందని చెప్పారు. ఉక్రెయిన్ ఆక్రమణ కోసం వచ్చిన రష్యా సైనికులు చనిపోతున్నారంటూ వారి తల్లులకు చెప్పాలన్నారు. ఆందోళనలు చేయాల్సిందిగా రష్యన్లకు పిలుపునివ్వాలన్నారు. వాళ్లు తమ సొంత నాయకత్వాన్ని చూసి భయపడిపోతున్నారన్నారు. ఈ యుద్ధం వారి అంతానికీ ఆరంభమని చెప్పాలన్నారు. ఉక్రెయిన్ కు శాంతి మాత్రమే కావాలన్నారు. 

తమకు మానవతా సాయం చేయాలనుకుంటే ఒక్కసారి తనకు చెప్పాలన్నారు. ఉక్రెయిన్ ను కాపాడుకునేందుకు పరస్పర సహకారం కోసం ‘ద సమ్మిట్ ఆఫ్ ఫస్ట్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ అనే ఓ వేదికను ఏర్పాటు చేశామని జెలెన్ స్కా చెప్పారు. అందులో భాగంగానే లిథువేనియా ఫస్ట్ లేడీ లెఫ్టినెంట్ డయానా నౌసిడీన్, లాట్వియా ఫస్ట్ లేడీ ఎల్వీ ఆండ్రా లెవైట్ ఉక్రెయిన్ కు మద్దతుగా మాట్లాడారని చెప్పారు.

  • Loading...

More Telugu News