Russia: విన్నిట్సియా విమానాశ్రయంపై రష్యా బాంబుల వర్షం.. పూర్తిగా ధ్వంసం
- ఉక్రెయిన్‌పై కనికరం చూపని రష్యా
- విన్నిట్సియా విమానాశ్రయంపై బాంబుల వర్షం
- నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని జెలెన్‌స్కీ మరో మారు విజ్ఞప్తి
- కనీసం ఆయుధాలైనా ఇవ్వాలని అభ్యర్థన
ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నా ఉక్రెయిన్‌పై రష్యా కనికరం చూపడం లేదు. బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతూనే ఉంది. ఉక్రెయిన్‌లోని సెంట్రల్ వెస్ట్రన్ రీజియన్ రాజధాని విన్నిట్సియా విమానాశ్రయంపై రష్యా బాంబుల వర్షం కురిపించి పూర్తిగా ధ్వంసం చేసింది. రష్యా సైన్యం 8 రాకెట్లతో విమానాశ్రయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. బాంబుల మోతతో ధ్వంసమైన విమానాశ్రయం నుంచి దట్టమైన పొగలు కమ్ముకొస్తున్న వీడియో వైరల్ అయింది.
రష్యా వెనక్కి తగ్గకపోవడంతో జెలెన్‌స్కీ మరోమారు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. విమానాశ్రయాలను కూడా రష్యా వదలడం లేదని, ఇప్పుడు ఒడెస్సా నగరంపైనా దాడులకు సిద్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ అడుగుతూనే ఉన్నామని రష్యా నుంచి తమ దేశాన్ని రక్షించేందుకు ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఐరోపా దేశాలను అభ్యర్థించారు. ఒకవేళ అలా ప్రకటించకుంటే ఆయుధాలైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.