Governor: ఏపీ అసెంబ్లీలో గందరగోళం మధ్యనే గవర్నర్ ప్రసంగం... ముఖ్యాంశాలు ఇవిగో!
- ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- ప్రసంగం ప్రతులు చించివేసిన టీడీపీ సభ్యులు
- ప్రభుత్వ పాలన, లక్ష్యాలను వివరించిన గవర్నర్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు. సభలో నినాదాలు చేశారు. అయినప్పటికీ, గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రసంగంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.
వాటిలోని ముఖ్యాంశాలు...
- 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం జీఎస్డీపీలో 0.22 శాతం వృద్ధి సాధించింది.
- తలసరి ఆదాయం 15.87 శాతం పెరిగి రూ.2,04,758కి చేరింది.
- నవరత్నాల అమలు ద్వారా ఆర్థిక అభివృద్ధి కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
- ఎన్డీబీ సాయంతో రాష్ట్రంలో రూ.6,400 కోట్లతో రహదారుల అభివృద్ధి జరిగింది.
- 9,200 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను రూ.1,073 కోట్ల వ్యయంతో మరమ్మతులు, అభివృద్ధి చేపట్టడం జరిగింది.
- పోలవరం పనులు 77 శాతం పూర్తయ్యాయి. 2023 నాటికి ప్రాజెక్టు పూర్తి.
- వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ కొనసాగుతోంది.
- పాతికేళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్ అందించేందుకు సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదిరింది.
- అందుకోసం ఒక్కో యూనిట్ కు రూ.2.5 చొప్పున ఏడాదికి రూ.7,500 కోట్ల వ్యయం అవుతుంది.
- మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం సీ పోర్టులు, భోగాపురం, దగదర్తి ఎయిర్ పోర్టుల నిర్మాణంపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది.
- రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగంలో రూ.7,015 కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. ఆయా పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించాయి.
- దేశవ్యాప్త పారిశ్రామిక ఎగుమతుల్లో ఏపీ వాటా 5.8 శాతంగా ఉంది.
- ఏపీలోని 3 ఇండస్ట్రియల్ కారిడార్ల ద్వారా వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నం జరుగుతోంది.
- ఏపీలో సుపరిపాలనకు అనువుగా 26 జిల్లాల ఏర్పాటు జరుగుతోంది. ఉగాది నాడు కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం అవుతుంది.
- ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకేసారి 5 డీఏలు విడుదల చేసింది.
- 11వ పీఆర్సీ అమలు చేస్తోంది. ఉద్యోగుల పదవీవిరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం జరిగింది.