TTD: వెంకన్న భక్తులకు శుభవార్త.. వచ్చే నెల 1 నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం
- కరోనా కారణంగా నిలిచిన ఆర్జిత సేవలు
- ఏప్రిల్ 1 నుంచి అన్ని సేవల పునఃప్రారంభం
- వర్చువల్ విధానం కూడా అందుబాటులోనే ఉంటుందన్న టీటీడీ
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు ఈ వార్త నిజంగానే శుభవార్తే. ఎందుకంటే.. కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తిరిగి ప్రారంభించనుంది. ఈ మేరకు సోమవారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి తిరుమలలో ఆర్జిత సేవలను పునఃప్రారంభించనున్నట్లుగా ఆ ప్రకటనలో తెలిపింది.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను పునఃప్రారంభించనున్నట్లుగా టీటీడీ వెల్లడించింది. గతంలో ఉన్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.
మరోవైపు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతోపాటు వర్చువల్ విధానాన్ని కూడా కొనసాగించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులు ఆయా సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదని పేర్కొంది. అయితే, వారికి శ్రీవారి దర్శనంతో పాటు ప్రసాదాలు అందిస్తామని తెలిపింది.
ఇక, అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న వారిని, ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతించనున్నట్టు వెల్లడించింది.