CM Jagan: ఆనాడు ఎంతో సాహసించి నా వెంట నడిచిన వ్యక్తుల్లో గౌతమ్ ఒకరు... సంగం బ్యారేజికి గౌతమ్ రెడ్డి పేరు పెడతాం: అసెంబ్లీలో సీఎం జగన్
- ఇటీవల మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
- అసెంబ్లీలో భావోద్వేగాలకు గురైన సీఎం జగన్
- తనకంటే గౌతమ్ ఏడాది పెద్ద అని వెల్లడి
- అయినా ఎంతో నమ్మకంతో అన్నా అని పిలిచేవాడని వివరణ
ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన మేకపాటి గౌతమ్ రెడ్డిని తలచుకుని సీఎం జగన్ అసెంబ్లీలో తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. గౌతమ్ రెడ్డి తనకు చిన్నప్పటి నుంచి మిత్రుడని, వయసులో ఏడాది పెద్దవాడైనప్పటికీ తనను అన్నా అని పిలిచేవాడని వెల్లడించారు. తానంటే గౌతమ్ కు అపారమైన నమ్మకం అని, తాను ఏంచెబితే అది చేసేవాడని తెలిపారు.
"నాకు ఏం నచ్చుతుందో గ్రహించి అందుకోసం తాపత్రయపడేవాడు. నేను విలువల కోసం కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చే నాటికి గౌతమ్ రాజకీయాల్లోనే లేడు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అయితే, నేను ఇవాళ ఈస్థాయికి వస్తానని ఆ సమయంలో నాతో సహా ఎవరూ అనుకుని ఉండరు. అలాంటివేళ కొద్దిమంది మాత్రం ఎంతో సాహసించి నా వెంట నడిచారు. వారిలో గౌతమ్ ఒకరు. నాపై గౌతమ్ కు ఉన్న నమ్మకం ఆయనను, ఆయన కుటుంబాన్ని కూడా నడిపించింది.
గౌతమ్ విద్యాధికుడు. బ్రిటన్ లో పేరుపొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మా ప్రభుత్వం ఏర్పడ్డాక క్యాబినెట్ లో ఒకేసారి 6 శాఖలు అప్పగిస్తే, సమర్థవంతంగా నిర్వర్తించాడు. గౌతమ్ ఇంగ్లీషులో అద్భుతంగా మాట్లాడతాడు. ఎంతో చొరవ ఉన్న వ్యక్తి. రాష్ట్రంలో ఎన్నడూ వినని పారిశ్రామికవేత్తలను కూడా తీసుకువచ్చాడు. సన్ ఫార్మా, బిర్లా, అదానీలు... పెద్ద కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వచ్చారంటే గౌతమ్ కృషి ఫలితమే. వారితో ఎంతో ప్రభావవంతంగా మాట్లాడడం, వారిని నా వద్దకు తీసుకురావడం, వారు ఏపీలో తమ పెట్టుబడులు పెట్టేవరకు గౌతమ్ శ్రమ ఎనలేనిది.
ఇటీవల దుబాయ్ వెళ్లేముందు కూడా నన్ను కలిశాడు. ఆల్ ది బెస్ట్ చెప్పాను. దుబాయ్ ఎక్స్ పోలో ఏ రోజు ఏంజరిగిందో, ఎవరిని కలిశారో ఎప్పటికప్పుడు సమాచారం పంపించేవాడు. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఎంత కష్టపడుతున్నదీ వివరించేవాడు. అతడి పనితీరును పత్రికలు, మీడియా చానళ్లలోనూ చూశాం. ఓ మంచి వ్యక్తి, నా స్నేహితుడు, సమర్థుడైన మంత్రి ఇప్పుడు లేడంటే ఎంతో బాధగా ఉంది. అసలు, ఆ ఆలోచననే భరించలేకపోతున్నాను. వ్యక్తిగతంగా నాకు, పార్టీకి, రాష్ట్రానికి గౌతమ్ రెడ్డి మరణం తీరనిలోటు.
అయితే, తన ప్రాంతానికి ఎంతో మంచి చేయాలని గౌతమ్ రెడ్డి తపించిపోయేవాడు. ఆయన కలను మేం నెరవేరుస్తాం. సంగం బ్యారేజికి గౌతమ్ రెడ్డి పేరు పెడతాం. మరో 6 వారాల్లో సంగం బ్యారేజి పనులు పూర్తవుతాయి. ప్రారంభోత్సవానికి వెళ్లి గౌతమ్ రెడ్డి పేరుమీద సంగం బ్యారేజీని అంకితం చేస్తాం.
గౌతమ్ రెడ్డి మరణించాక ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డి కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మెరిట్స్) కాలేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెట్టి దాన్ని అగ్రికల్చర్, హార్టికల్చర్ కాలేజీగానూ మార్చండి అని కోరారు. వారు చెప్పినట్టే చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఉదయగిరి ప్రాంతాన్ని ఫేజ్-2 నుంచి ఫేజ్-1లోకి తీసుకువచ్చి త్వరితగతిన పూర్తి చేస్తాం. ఉదయగిరికి నీరు ఇవ్వాలన్న విజ్ఞప్తిని కూడా నెరవేరుస్తాం.
ఉదయగిరిలో డిగ్రీ కాలేజీ వసతులు మెరుగుపర్చాలని కోరారు. దాన్ని నాడు-నేడు ఫేజ్-2 కిందికి తీసుకువచ్చి వసతులు కల్పిస్తాం. గౌతమ్ రెడ్డిని జిల్లా ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకునేలా చేస్తాం. గౌతమ్ ఎంతో మంచివాడు. ఆయన పైలోకంలో ఉన్నా దేవుడు చల్లగా చూస్తాడు. తను లేకపోయినా ఆయన కుటుంబ సభ్యులకు నేను, నాతో పాటు వైసీపీలోని ప్రతి ఒక్కరూ అండగా ఉంటాం" అని సీఎం జగన్ అసెంబ్లీలో వివరించారు.