BJP: ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో పిటిషన్ వేశామన్న రఘునందన్ రావు
- అసెంబ్లీ కార్యదర్శిని వివరణ కోరిన బీజేపీ ఎమ్మెల్యేలు
- నాలుగు రోజుల్లోగా వివరణ ఇస్తానన్న కార్యదర్శి
- సంజయ్ తో కలిసి రాష్ట్రపతిని కలుస్తామన్న రఘునందన్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజైన సోమవారం.. నిమిషాల వ్యవధిలోనే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఈ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సభ మొదలైన రెండు నిమిషాలకే తమను ఎలా సస్పెండ్ చేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ కీలక నేతలు టీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు.
ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ మేరకు తమ సస్పెన్షన్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశామని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నేడు మీడియాకు తెలిపారు. అయితే తమను ఏ కారణంగా సభ నుంచి సస్పెండ్ చేశారో చెప్పాలంటూ తాజాగా అసెంబ్లీ కార్యదర్శిని బీజేపీ ఎమ్మెల్యేలు వివరణ కోరారు.
నాలుగు రోజుల్లోగా వివరణ ఇస్తానని అసెంబ్లీ కార్యదర్శి చెప్పినట్లుగా రఘునందన్ రావు తెలిపారు. ఏమైనా ఈ వ్యవహారాన్ని తాము అంత ఈజీగా వదలదలచుకోలేదని కూడా ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి తాము రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలవనున్నామని కూడా రఘునందన్ తెలిపారు.