Nassir Hussain: వార్న్ పైనుంచి కూడా నన్ను స్లెడ్జింగ్ చేస్తుంటాడేమో!: నాసిర్ హుస్సేన్ చమత్కారం
- షేన్ వార్న్ మరణంపై నాసిర్ స్పందన
- గతంలో జరిగిన ఓ ఘటనను వివరించిన వైనం
- మైదానంలో కఠినంగా ఉన్నా బయట మంచివాడేనని వ్యాఖ్య
ఆస్ట్రేలియా మహోన్నత లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ థాయ్ లాండ్ లో గుండెపోటుతో మరణించడం తెలిసిందే. వార్న్ మృతితో సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. మైదానంలో వార్న్ తో తీవ్ర శత్రుత్వం కొనసాగించిన మాజీ క్రికెటర్లు కూడా ఈ పరిణామంతో చలించిపోయారు. ఈ నేపథ్యంలో, ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ స్పందించారు. వార్న్ పైనుంచి కూడా నన్ను స్లెడ్జింగ్ చేస్తుంటాడేమో అని చమత్కరించారు.
ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మైదానంలో స్లెడ్జింగ్ చేయడంలో ఎంతటి దిట్టలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల గుండెపోటుతో మరణించిన షేన్ వార్న్ కూడా మాటలతో రెచ్చగొట్టడంలో మాస్టర్. ఇదే విషయాన్ని నాసిర్ హుస్సేన్ గుర్తుచేసుకున్నారు.
"1999లో అనుకుంటా... డేవిడ్ లాయిడ్ మా కోచ్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో నేను క్రీజులో ఉన్నాను. షేన్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో అతడు ఆస్ట్రేలియాకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఎప్పట్లాగానే అతడు నన్ను దూషించడం మొదలుపెట్టాడు. దాంతో నేను... ఇదే నీకు చివరి గేమ్ అవుతుంది... బాగా ఎంజాయ్ చేయ్... మరోసారి నిన్ను ఆస్ట్రేలియా కెప్టెన్ గా నియమించరు అంటూ ఘాటుగా బదులిచ్చాను. ఓ 15 నిమిషాల తర్వాత వార్న్ బౌలింగ్ లోనే స్టంపౌట్ అయ్యాను. వార్న్ ఆ సమయంలో నాకు ఘనంగా వీడ్కోలు పలికాడు... నేను పెవిలియన్ కు వెళుతుంటే అతడు ఏమన్నాడో మీకు చెప్పలేను" అని వివరించారు.
కాగా, ఆనాటి మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. 233 పరుగుల లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అయితే వార్న్ లోని మరో కోణాన్ని కూడా హుస్సేన్ వెల్లడించారు.
"నేను మాత్రం వార్న్ తో సజావుగా వ్యవహరించేవాడ్ని. వార్న్ లో ఓ గొప్పదనం ఉంది. అతడి బౌలింగ్ లో ఎవరైనా భారీగా పరుగులు చేస్తే అభినందించేవారిలో ముందు ఉండేవాడు. డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి మరీ వారిని అభినందించేవాడు. మైదానంలోనే వార్న్ కఠినంగా ఉండేవాడు... బయట మాత్రం ఎంతో మంచి వ్యక్తి" అంటూ నాసిర్ హుస్సేన్ వెల్లడించారు.