Allari Pilla: తియ్యని మాటలతో ముగ్గులోకి దింపి నగదు కాజేసే ‘అల్లరి పిల్ల’ .. చిక్కిన ముఠా!

Allari pilla Facebook gang arrested in Chittor
  • ‘అల్లరి పిల్ల’ ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్
  • యాక్సెప్ట్ చేస్తే తియ్యని మాటలతో బురిడీ
  • ఆపై అర్ధనగ్నంగా వీడియో కాల్
  • ఫోన్‌ను తన యాక్సెస్‌లోకి తీసుకుని డబ్బులు కొట్టేస్తున్న నిందితురాలు
  • చిత్తూరుకు చెందిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.3.64 లక్షలు మాయం
  • 8 మంది అరెస్ట్.. పరారీలో ‘అల్లరి పిల్ల’
తియ్యని మాటలతో అమాయకులను బుట్టలో పడేసి ఆపై అర్ధనగ్న వీడియో కాల్స్‌తో వారి ఫోన్‌ను హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసే ‘అల్లరి పిల్ల’ ముఠాను చిత్తూరు పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లరి పిల్ల అనేది ఓ ఫేస్‌బుక్ ఖాతా. దీని ద్వారా ఓ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంది. అవతలి వారు దానిని అంగీకరించిన వెంటనే అసలు కథ మొదలవుతుంది. ఖాతా ప్రొఫైల్ ఫొటోలో ఉన్న మహిళ తొలుత చాట్ చేస్తుంది. తియ్యని మాటలతో వీడియో చాటింగ్‌కు ఆహ్వానిస్తుంది. 

అందులో భాగంగా ఓ లింకు పంపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే అవతలి మహిళ అర్ధనగ్నంగా మాట్లాడుతూనే అవతలి వ్యక్తి ఫోన్‌ను తన యాక్సెస్‌లోకి తీసుకుంటుంది. ఆ తర్వాతి నుంచి అతడు ఆ ఫోన్ ద్వారా ఏం చేసినా ఆమెకు తెలిసిపోతుంది. చిత్తూరుకు చెందిన సీకే మౌనిక్ ఇలానే లింక్‌ను క్లిక్ చేసి ఆమెతో మాట్లాడాడు. ఆ తర్వాత నాలుగు విడతలగా అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.3,64,227 మాయమయ్యాయి. ఆ డబ్బును ఆమె తన ముఠాలోని ఇతర సభ్యులకు పంపింది.

తన ఖాతా నుంచి అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు మాయం కావడంతో హతాశుడైన మౌనిక్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న విశాఖపట్టణానికి చెందిన అడప సాంబశివరావు (32), ఆనంద్ మెహతా (35), గొంతెన శ్రీను (21), చందపరపు కుమార్ రాజా (21), లోకిరెడ్డి మహేష్ (24), గొంతెన శివకుమార్ (2), వరంగల్‌కు చెందిన తోట శ్రావణ్‌కుమార్ (31), కడపకు చెందిన చొప్పు సుధీర్ కుమార్ అలియాస్ సుకు అలియాస్ హనీ (30)ని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముపట్ల మానస అలియాస్ ‘అల్లరిపిల్ల’ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
Allari Pilla
Facebook
Gang
Crime News
Andhra Pradesh

More Telugu News