Rasheed Latif: రోహిత్ శర్మ వ్యాఖ్యలు సరికాదు: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్
- అశ్విన్ ఆల్ టైమ్ గ్రేట్ అని చెప్పిన రోహిత్ శర్మ
- ఆల్ టైమ్ గ్రేట్ అని చెప్పడానికి ఇంకొంత సమయం ఉందన్న రషీద్ లతీఫ్
- కుంబ్లే గొప్ప బౌలర్ అని కితాబు
శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన వంతు పాత్రను పోషించాడు. అర్ధ శతకాన్ని సాధించడంతో పాటు ఆరు వికెట్లను ఆయన సాధించాడు. ఇదే సమయంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును సైతం అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఇండియా బౌలర్లలో రెండో వ్యక్తిగా అవతరించాడు. ఈ సందర్భంగా అశ్విన్ పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు.
తన దృష్టిలో అశ్విన్ ఆల్ టైమ్ గ్రేట్ అని రోహిత్ అన్నాడు. దేశం కోసం అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడని చెప్పాడు. ఎన్నో మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్సులు ఇచ్చాడని తెలిపాడు. జనాలకు వివిధ అభిప్రాయాలు ఉంటాయని.. కానీ తాను మాత్రం అశ్విన్ ను ఆల్ టైమ్ గ్రేట్ గానే చూస్తానని చెప్పాడు.
రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ స్పందించాడు. అశ్విన్ గొప్ప బౌలర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని... అయితే, విదేశాల్లో ఆయన పర్ఫామెన్స్ ను పరిగణనలోకి తీసుకుంటే, ఆయన ఆట్ టైమ్ గ్రేట్ అని చెప్పడానికి కొంత సమయం పడుతుందని అన్నాడు. తన బౌలింగ్ లో అశ్విన్ అనేక వేరియేషన్లను తీసుకొచ్చాడని తెలిపాడు. స్వదేశంలో ఎస్జీ బాల్ ను పరిగణనలోకి తీసుకుంటే ఇండియాలో బెస్ట్ స్పిన్నర్ అశ్విన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడు.
కుంబ్లే చాలా గొప్ప అని, అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని రషీద్ కొనియాడాడు. జడేజా కూడా మంచి ప్రదర్శనలు ఇచ్చాడని చెప్పాడు. పాత తరంలోకి వెళ్తే బిషన్ సింగ్ బేడీ బ్రిలియంట్ అని ప్రశంసించాడు. అశ్విన్ గురించి రోహిత్ కొంచెం పొరపాటుగా మాట్లాడినట్టున్నాడని చెప్పాడు. అయితే ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ఇదొక భాగమని వ్యాఖ్యానించాడు.