Assembly Elections: మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దేశం
- ఐదు రాష్ట్రాలకు పలు విడతలుగా జరిగిన ఎన్నికలు
- ఉదయం 8 గంటలకు బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభం
- మధ్యాహ్నం నాటికి ఫలితాలపై స్పష్టత
- లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత
దేశంలోని ఐదు రాష్ట్రాలకు పలు విడతలుగా జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం పంజాబ్ మినహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో బీజేపీదే విజయమని అంచనా వేశాయి. పంజాబ్ మాత్రం ఏకపక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతమవుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 1,200 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఓటింగ్ సరళి తెలిసిపోనుంది. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై స్పష్టత వచ్చేస్తుంది. రాత్రికల్లా పూర్తి ఫలితాలు వస్తాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.