ICC Womens World Cup 2022: అర్ధ సెంచరీలతో అదరగొట్టిన అమిలియా, అమీ సాటెర్త్‌వైట్.. భారత్ ఎదుట కొండంత లక్ష్యం
- ప్రపంచకప్‌లో భారత్ రెండో మ్యాచ్
- 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన కివీస్
- చివర్లో బంతితో విజృంభించిన పూజా వస్త్రాకర్
- 75 పరుగులు చేసిన అమీ సాటెర్త్‌వైట్
భారత్‌తో జరుగుతున్న ప్రపంచకప్ పోరులో న్యూజిలాండ్ అమ్మాయిలు చెలరేగిపోయారు. టాస్ గెలిచి కివీస్‌కు బ్యాటింగ్ అప్పగించడం ఎంత తప్పో మిథాలీ సేనకు తొలి ఐదు ఓవర్లలోనే అర్థమైంది. 9 పరుగులకే న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత భారత బౌలర్లను కివీస్ బ్యాటర్లు చెడుగుడు ఆడేసుకున్నారు. వికెట్లను కాపాడుకుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, చివర్లో మాత్రం భారత బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ వడివడిగా వికెట్లు కోల్పోయి 9 వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది.
కెప్టెన్ సోఫీ డివైన్ (30 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు) ధాటిగా ఆడగా, అమిలియా కెర్, అమీ సాటెర్త్‌వైట్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. అమిలియా 64 బంతుల్లో 50 పరుగులు చేయగా, అమీ 84 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు చేసింది. మేడీ గ్రీన్ 27, వికెట్ కీపర్ కేటీ మార్టిన్ 41 పరుగులు చేశారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లతో విజృంభించగా, రాజేశ్వరి గైక్వాడ్ 2, జులన్ గోస్వామి, దీప్తి శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.