AAP: భగత్ సింగ్ ఊరిలో భగవంత్ మాన్ ప్రమాణం!
- ఖత్కర్ కలాన్ భగత్ సింగ్ సొంతూరు
- సీఎంగా ఆ గ్రామంలోనే ప్రమాణం చేస్తానన్న ఆప్ నేత
- రాజ్ భవన్లో ప్రమాణం చేయబోనని వెల్లడి
- పంజాబ్‌లో స్పష్టమైన మెజారిటీ దిశగా ఆప్
సామాన్యుల పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆది నుంచి సంచలనాలనే నమోదు చేస్తోంది. జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లకు చుక్కలు చూపించిన ఆప్.. ఢిల్లీ సీఎం పీఠంపై ఇప్పటికే తిష్ట వేసింది. తాజాగా రైతు ఉద్యమానికి ఊపిరి పోసిన పంజాబ్ లో కూడా సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంది.
పంజాబ్ సహా 5 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండగా.. యూపీలో బీజేపీ, పంజాబ్‌లో ఆప్ విజయ భేరీ మోగించేశాయి. 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో ఇప్పటికే 51 సీట్లను గెలుచుకున్న ఆప్ మరో 42 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. వెరసి ఆ రాష్ట్ర పాలనా పగ్గాలను ఆప్ చేజిక్కించుకున్నట్లే.
ఎన్నికలకు ముందే.. ఒకవేళ పంజాబ్‌లో ఆప్ గెలిస్తే సీఎం ఎవరన్న విషయంపై ఆ పార్టీ పెట్టిన పోల్‌లో పార్టీకి చెందిన కీలక నేత భగవంత్ మాన్ సింగ్‌కు పంజాబీలు ఓటేశారు. సీఎం అభ్యర్థిగా ఆయన పేరునే ప్రకటించిన ఆప్..ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయింది. తాజాగా అటు కాంగ్రెస్ తో పాటు ఇటు ఆ రాష్ట్రంలో కీలక పార్టీగా ఉన్న అకాళీదళ్ ను కూడా ఆప్ మట్టి కరిపించింది. ఇక త్వరలోనే భగవంత్ మాన్ పంజాబ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
పార్టీ విజయం నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకుండానే భగవంత్ కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆప్.. మున్ముందు మరింత మేర సత్తా చాటనుందని ఆయన చెప్పారు. సీఎంగా తాను రాజ్ భవన్లో ప్రమాణం చేయబోవడం లేదని చెప్పిన మాన్.. దేశం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించిన భగత్ సింగ్ స్వగ్రామం అయిన ఖత్కర్ కలాన్ గ్రామంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు.