Vladimir Putin: ఇప్పటికీ లొంగని ఉక్రెయిన్... 8 మంది సైనికాధికారులపై పుతిన్ వేటు

Putin reportedly sacked eight military officers

  • నేటికి రష్యా దాడులకు 15 రోజులు
  • ఏమాత్రం ఖాతరు చేయని ఉక్రెయిన్
  • సైనికులకు తోడుగా తుపాకీ పట్టి పోరాడుతున్న ప్రజలు
  • నిఘా వర్గాలపైనా పుతిన్ మండిపాటు
  • తనను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం

పొరుగునే ఉన్న ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు తెరదీసి రెండు వారాలు దాటింది. ఆయుధ సంపత్తిలోనూ, సైనిక సంఖ్యా పరంగానూ ఏవిధంగానూ తనతో సరితూగని ఉక్రెయిన్ ను సులువుగా లొంగదీసుకోవచ్చని రష్యా భావించింది. అయితే, ఉక్రెయిన్ లొంగలేదు సరికదా, కొరకరానికొయ్యలా మారింది. రష్యన్ దళాలను ఎక్కడికక్కడ ఎదుర్కొంటూ, మొక్కవోని దేశభక్తితో ఉక్రెయిన్ సైనికులు, సాధారణ ప్రజలు తీవ్ర పోరాటం సాగిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, తన అంచనాలు తప్పడానికి కొందరు సైనికాధికారులే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఉక్రెయిన్ పై పట్టు సాధించలేకపోవడానికి సదరు సైనికాధికారుల తప్పుడు వ్యూహాలు, సలహాలే కారణమని పుతిన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో 8 మంది సైనిక జనరళ్లపై ఆయన వేటు వేశారు. అంతేకాదు, రష్యా గూఢచార విభాగంపైనా పుతిన్ మండిపడుతున్నారని కీవ్ వర్గాలు తెలిపాయి. 

దీనిపై ఉక్రెయిన్ భదత్రా మండలి అధిపతి ఒలెక్సీ డానిలోవ్ స్పందిస్తూ, తమపై దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 8 మంది రష్యన్ కమాండర్లను పుతిన్ తొలగించారని వెల్లడించారు. మొదటివారంలో వ్యూహాలు బెడిసికొట్టిన నేపథ్యంలో, రష్యా దాడుల పంథాను మార్చేసిందని తెలిపారు. 

ఇక, ఉక్రెయిన్ ఎంతో బలహీనంగా ఉందని, ఇప్పుడు దాడి చేస్తే వెంటనే వశమవుతుందని తనకు తప్పుడు సలహాలు ఇచ్చినందుకు నిఘా విభాగం అధికారులపైనా పుతిన్ చాలా కోపంగా ఉన్నారని బ్రిటన్ ఇంటెలిజెన్స్ మాజీ సీనియర్ అధికారి ఫిలిప్ ఇంగ్రామ్ తెలిపారు. ఉక్రెయిన్ పై తాను తీసుకున్న నిర్ణయం పేలవంగా ఉందన్న విషయం పుతిన్ కు కూడా అర్థమైందని పేర్కొన్నారు. సునాయాసంగా లభిస్తుందనుకున్న ఉక్రెయిన్ మొండిగా పోరాడుతుండగా, రష్యన్లకు అత్యధిక ప్రాణనష్టం కలిగించే రీతిలో ఆ పోరాటం ఉండడం పుతిన్ కు మింగుడుపడడంలేదని ఇంగ్రామ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News