Uttar Pradesh: భారీ మెజారిటీతో గెలిచిన అఖిలేశ్ యాదవ్
- యూపీ బరిలో ఎస్పీకి ఘోర పరాభవం
- తొలి సారి అసెంబ్లీ బరిలోకి ఎస్పీ చీఫ్
- కర్హాల్ నుంచి పోటీ చేసిన అఖిలేశ్
- బీజేపీ అభ్యర్థిపై 65 వేల మెజారిటీతో గెలుపు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేశాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాల విషయం అలా పక్కనపెడితే.. దేశ రాజకీయాలను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేయగలిగిన రాష్ట్రంగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తింది. ఫలితాల్లో రికార్డులు నమోదు చేసిన ఈ రాష్ట్రం.. చాలా కాలం తర్వాత వరుసగా ఒకే పార్టీకి అధికారం కట్టబెట్టింది. అంతేకాకుండా ఓ నేతకు వరుసగా రెండో సారి సీఎం పీఠాన్ని కూడా అప్పగించింది.
అదే సమయంలో దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుందని భావిస్తున్న సమాజ్ వాదీ పార్టీకి షాకిచ్చిన ఈ ఫలితాలు ఆ పార్టీ అధినేతకు మాత్రం గ్రాండ్ విక్టరీతో కాస్తంత ఊరటను ఇచ్చాయి. యూపీ ఎన్నికల్లో బీజేపీని పడగొట్టేసి అధికారం చేజిక్కించుకుంటుందని భావించిన సమాజ్ వాదీ పార్టీ ఫలితాల్లో ఘోర పరాభవాన్ని చూసింది. మిత్రపక్షాలతో కలిసి మొత్తం అన్ని స్థానాల్లో బరిలోకి దిగిన ఎస్పీ.. 125 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆధిక్యంలోకి రాలేకపోయిన ఎస్పీ చివరకు 125 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికలు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కు అత్యంత కీలకమైన ఎన్నికల కిందే లెక్క. ఎందుకంటే.. ఆయన ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల బరిలోకే దిగలేదు. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేసిన సమయంలోనూ ఆయన ఎమ్మెల్సీగానే ఉన్నారు తప్పించి ఎమ్మెల్యేగా కాదు. ఎంపీగా పలుమార్లు గెలిచిన అఖిలేశ్... ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీగానే ఉన్నారు.
అయితే ఈ దఫా బీజేపీని ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో సాగిన అఖిలేశ్ తన రాజకీయ ప్రస్థానంలో తొలిసారి అసెంబ్లీ బరిలో దిగారు. ఎస్పీకి మంచి పట్టున్న కర్హాల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అఖిలేశ్.. బీజేపీ అభ్యర్థిపై ఏకంగా 67 వేల పైచిలుకు ఓట్లతో భారీ విక్టరీ కొట్టారు.