Vijayasanthi: ఈ ఎన్నికల ఫలితాలతోనైనా కేసీఆర్ కు కనువిప్పు కలుగుతుందా?: విజయశాంతి
- 4 రాష్ట్రాల్లో కమలం వికసించిందన్న విజయశాంతి
- భవిష్యత్ లో పంజాబ్ లోనూ గెలుస్తామని ధీమా
- కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. 5 రాష్ట్రాలకు గాను 4 రాష్ట్రాల్లో కమలం వికసించిందని తెలిపారు. విపక్షాలు ఓ బూచిలా చూపిన వ్యవసాయ చట్టాల ప్రభావం ఏమీ లేదని తేలిపోయిందని అభిప్రాయపడ్డారు. బీజేపీని ముస్లిం వ్యతిరేక పార్టీగా, మతతత్వ పార్టీగా ముద్రవేసిన ప్రతిపక్షాలకు ఉత్తరప్రదేశ్ లో గెలుపు పెద్ద చెంపపెట్టు అని విజయశాంతి పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులను ఒక్క పైసా వసూలు చేయకుండా స్వదేశానికి తరలిస్తోందని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క పంజాబ్ లో మాత్రమే బీజేపీ వెనుకబడిందని విజయశాంతి అన్నారు. భవిష్యత్ లో పంజాబ్ లోనూ జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారం రెండు రాష్ట్రాలకే పరిమితమైందని, త్వరలోనే కాంగ్రెస్ విముక్త భారత్ సాకారం కావడం ఖాయమని స్పష్టం చేశారు. అంతేకాదు, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడుతుండడంపైనా ఆమె స్పందించారు.
ఫెడరల్ ఫ్రంట్ అంటూ బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నడుంబిగించారని, మరి ఈ ఎన్నికల ఫలితాలతోనైనా కేసీఆర్ కు కనువిప్పు కలుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. అయితే, ఆయనకు బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు.