Punjab: నేను ఉగ్రవాదిని కాదని పంజాబ్ ప్రజలు తీర్పిచ్చారు: కేజ్రీవాల్
- పార్టీ గెలుపుతో పంజాబ్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు
- మాకు వ్యతిరేకంగా పార్టీలన్నీ ఒక్కటై కుట్ర పన్నాయి
- కేజ్రీవాల్ ఈ మట్టి మనిషి.. నిజమైన జాతీయవాది
పంజాబ్ ఓటర్లు తమ తీర్పుతో నేను ఉగ్రవాదిని కాదని తీర్పు ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పార్టీ గెలుపుతో ప్రజలు గర్జిస్తూ సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు.
రాజకీయ పార్టీలన్నీ ‘ఆప్’కు వ్యతిరేకంగా ఒక్కటయ్యాయని, అందరూ తమనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తమ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద కుట్రలు కూడా జరిగాయన్నారు. కేజ్రీవాల్ ఉగ్రవాది అని చెప్పేందుకు పార్టీలన్నీ ఒక్కటయ్యాయని అన్నారు. అయితే, ప్రజలు కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని తీర్పిచ్చారని అన్నారు. అతడు ఈ మట్టి మనిషని, నిజమైన జాతీయవాదని అన్నారు.
పంజాబ్‌లో ఆప్ ఘన విజయం తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులకు కేజ్రీవాల్ అండగా నిలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ పంజాబ్ సీఎం లేదంటే ఖలిస్థాన్ ప్రధాని కావాలనుకుంటున్నారని కుమార్ విశ్వాస్ అన్నారు. మరోవైపు, కాంగ్రెస్, బీజేపీలు కేజ్రీవాల్‌పై ‘వేర్పాటువాద అనుకూలురని’ ముద్రవేశాయి.
వారి ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను స్వీటెస్ట్ టెర్రరిస్టునని అన్నారు. ‘‘అవును ప్రజల కోసం ఆసుపత్రులు, స్కూళ్లు నిర్మిస్తున్న మధురమైన ఉగ్రవాదినని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా కేజ్రీవాల్ విమర్శలు చేశారు. తాను ప్రొ సెపరేటిస్ట్ (వేర్పాటువాద అనుకూలుడు)ను అయితే మోదీ ఎందుకు నిరూపించలేకపోయారని, దర్యాప్తు ఎందుకు జరిపించలేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు.