KCR: యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్
- స్వల్ప అనారోగ్యంతో యశోదకు కేసీఆర్
- గుండె సంబంధిత సమస్యలున్నాయేమోనన్న అనుమానం
- యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ చేసిన వైద్యులు
- సమస్యలేమీ లేవని వెల్లడి
తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేటి ఉదయం కాస్త నలతగా అనిపించడంతో ఆయనను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఎడమ చేయితో పాటు కాలు కూడా లాగుతున్నట్లుగా ఉందని కేసీఆర్ చెప్పడంతో ఆయనకు గుండె సంబంధిత వ్యాధులేమైనా ఉన్నాయా? అన్న కోణంలో యశోద ఆసుపత్రి వైద్యులు పలు వైద్య పరీక్షలు చేశారు. యాంజియోగ్రామ్తో పాటుగా సిటీ స్కాన్, ఈసీజీ తదితర పరీక్షలను నిర్వహించారు.
ఈ పరీక్షల అనంతరం కేసీఆర్కు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అంతేకాకుండా ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నేరుగా ప్రగతి భవన్కు వెళ్లారు. స్వల్ప అనారోగ్యం కారణంగా యాదాద్రి పర్యటనను కూడా కేసీఆర్ వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
మరోపక్క, కేసీఆర్ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలియగానే.. టీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది. అయితే ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఏమీ లేవని, వైద్య పరీక్షల అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశామని వైద్యులు వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.