Team India: టీమిండియా-శ్రీలంక పింక్ బాల్ టెస్టుకు సర్వం సిద్ధం
- మార్చి 12 నుంచి రెండో టెస్టు
- బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
- ఉత్సాహంతో ఉన్న టీమిండియా
- గాయాలతో లంక జట్టు సతమతం
టీమిండియా, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరి టెస్టు రేపు (మార్చి 12) బెంగళూరులో ప్రారంభం కానుంది. ఇది డే అండ్ నైట్ టెస్టు కావడంతో పింక్ బాల్ తో ఆడనున్నారు. తొలి టెస్టు గెలిచి మాంచి ఊపుమీదున్న టీమిండియా... పింక్ బాల్ టెస్టులోనూ అదరగొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. బ్యాట్స్ మెన్ అందరూ ఫామ్ లో ఉండగా, బౌలర్లు కూడా బ్యాటింగ్ లో రాణిస్తుండడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేసింది.
మరోవైపు, శ్రీలంక జట్టును గాయాల బెడద వేధిస్తోంది. కండరాల గాయంతో సీనియర్ పేసర్ లహిరు కుమార జట్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టులో 61 పరుగులు చేసిన పథుమ్ నిస్సాంక వీపు నొప్పితో బాధపడుతున్నాడు. గాయంతో తొలిటెస్టుకు దూరమైన దుష్మంత చమీర ఇప్పటికీ కోలుకోలేదు.
దీనిపై శ్రీలంక సారథి దిముత్ కరుణరత్నే మాట్లాడుతూ, టెస్టులో గెలవాలంటే 20 వికెట్లు పడగొట్టడం తప్పనిసరి అని, తమకిప్పుడు అతికొద్దిమంది బౌలర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని విచారం వ్యక్తం చేశాడు. టీమిండియా వంటి గట్టి జట్టుపై ఇలాంటి పరిస్థితుల్లో నెగ్గడం చాలా కష్టమైన పని అని అభిప్రాయపడ్డాడు.