Mithali Raj: వరల్డ్ కప్ లో కెప్టెన్ గా మిథాలీ రికార్డ్
- అత్యధిక మ్యాచ్ లకు సారథ్యం
- ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిందా రికార్డు బద్దలు
- ఇవాళ్టి మ్యాచ్ తో 24 మ్యాచ్ లకు మిథాలీ నేతృత్వం
టీమిండియా విమెన్స్ లెజెండ్ మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే ప్రపంచకప్ లో అత్యధిక మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించి రికార్డులు బద్దలు కొట్టింది. తద్వారా ఆస్ట్రేలియా మహిళల మాజీ కెప్టెన్ బెలిందా క్లార్క్ ను ఆమె అధిగమించింది. ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ వెస్టిండీస్ తో మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ తో మిథాలీ రాజ్ మొత్తంగా 24 వరల్డ్ కప్ మ్యాచ్ లకు సారథిగా వ్యవహరించింది. ఆమె సారథిగా వరల్డ్ కప్ లో ఇప్పటిదాకా 14 మ్యాచ్ లలో విజయం సాధించగా.. ఎనిమిదింట్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఇవాళ జరుగుతున్న మ్యాచ్ ఫలితం కూడా భారత్ కే అనుకూలంగా వచ్చే అవకాశం వుంది.
అంతేగాకుండా రెండు కన్నా ఎక్కువ వరల్డ్ కప్ లకు కెప్టెన్ గా మిథాలీ, బెలిందాలే వ్యవహరించడం విశేషం. మరోవైపు గత ఆదివారం జరిగిన మ్యాచ్ తో ఆరు వరల్డ్ కప్ లలో ఆడిన మూడో క్రికెటర్ గా, ఒకే ఒక్క మహిళా క్రికెటర్ గా మిథాలీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.