Tollywood: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ గేయ రచయిత కందికొండ కన్నుమూత
- 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం'తో సినిమాల్లోకి ఎంట్రీ
- మెలొడి సాంగ్స్ రైటర్‌గా మంచి గుర్తింపు
- ఇడియట్, సత్యం, పోకిరి వంటి చిత్రాలకు పాటలు
- వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కందికొండ
- తెలంగాణ ప్రభుత్వం తరఫున చికిత్సలకు కేటీఆర్ ఏర్పాట్లు
- కోలుకున్నట్లు కనిపించినా.. తుది శ్వాస విడిచిన వైనం
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో శనివారం మరో విషాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (49) కాసేపటి క్రితం మరణించారు. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కందికొండ యాదగిరి.. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యంపై తనకున్న ఆసక్తి నేపథ్యంలో ఆయన తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రముఖ హీరో రవితేజ లీడ్ రోల్‌గా దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం"లో "మళ్లి కూయవే గువ్వా.." అన్న పాటతో కందికొండ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇడియట్, సత్యం, పోకిరి, లవ్లీ, నీది నాది ఒకే కథ.. తదితర చిత్రాలకు ఆయన పాటలు రాశారు.
2018లో వెన్నెముక సమస్య తలెత్తడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన కందికొండ ఆ తర్వాత పాటలు రాయలేకపోయారు. అంతేకాకుండా కందికొండ అనారోగ్యం కారణంగా ఆయన కుటుంబం కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్..కందికొండకు ప్రభుత్వం తరఫున చికిత్స అందించేలా ఏర్పాటు చేశారు. దీంతో కందికొండ ఆరోగ్యం మెరుగైనట్లు కనిపించినా.. మరోమారు క్షీణించింది. చివరకు ఆయన శనివారం తుది శ్వాస విడిచారు.