GHMC: జీహెచ్ఎంసీపై కేసు పెట్టండి.. పోలీసులకు 11 ఏళ్ల బాలిక ఫిర్యాదు
- రోడ్ సేఫ్టీపై డిసెంబర్లో సమావేశం
- పలు మరమ్మతులను సూచించిన ట్రాఫిక్ డీసీపీ
- ఆ దిశగా చర్యలు చేపట్టని జీహెచ్ఎంసీ
- జీహెచ్ఎంసీపై శాహెర్ కౌర్ ఫిర్యాదు
రోడ్ల మరమ్మతులు చేయాల్సిన జీహెచ్ఎంసీ అధికారులపై ఓ 11 ఏళ్ల బాలిక ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసేసింది. రోడ్ల మరమ్మతులు చేయాల్సిన అధికారులు నాలుగు నెలలు అవుతున్నా స్పందించకపోవడంతో విసుగు చెందిన ఆ బాలిక నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. రోడ్ల మరమ్మతులను మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్ఎంసీ అధికారులపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు 11 ఏళ్ల బాలిక శాహెర్ కౌర్ మాదాపూర్ డీసీపీ శిల్పవల్లికి కంప్లైంట్ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో పాటు సర్కిల్లో పనిచేస్తున్న ఇంజినీర్‌పైనా కేసు పెట్టాలని ఆ బాలిక పోలీసులను కోరింది.
ఈ కేసు వివరాల్లోకెళితే.. గతేడాది డిసెంబర్ 30న రహదారి ప్రమాదాల నివారణ కోసమంటూ నిర్వహించిన సమావేశంలో ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్ల మరమ్మతులకు సంబంధించి శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ పలు సూచనలు చేశారట. ఇందులో భాగంగా రహదారులపై వాహనాల వేగం తగ్గించడంతో పాటుగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా డీసీపీ సూచించారట.
అయితే నాలుగు నెలలు గడుస్తున్నా.. డీసీపీ సూచించినట్లుగా ఒక్కటంటే ఒక్క మరమ్మతును కూడా జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టలేదట. దీంతో ఇదే విషయాన్ని ప్రస్తావించిన శాహెర్ కౌర్.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో పాటు సర్కిల్లో పనిచేస్తున్న ఇంజినీర్‌పై కేసులు నమోదు చేయాలంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది.