Zelenskyy: రష్యా రూటు మార్చింది.. చర్చల దారికొస్తోంది: జెలెన్ స్కీ
- రష్యా చొరబాటుదారులు మమ్మల్ని ఓడించలేరు
- వారి దగ్గర అంత బలం, స్ఫూర్తి లేవు
- కేవలం ఆయుధాలు, హింసనే వారు నమ్ముకున్నారు
- వీడియో ప్రకటన విడుదల చేసిన ఉక్రెయిన్ అధినేత
రష్యా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా చర్చల బాట పట్టినట్టు చెప్పారు. రష్యా లోగడ అల్టిమేటమ్ లను జారీ చేసేదంటూ.. ఇప్పుడు చర్చల సంకేతం పంపించడం సంతోషకరమన్నారు. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య పలు విడతలు చర్చలు జరిగినా ఎటువంటి ఫలితం రాకపోవడం గమనార్హం. మరోవైపు రష్యా వద్ద ఆయుధ బలమే కానీ, తమను ఓడించే సత్తా లేదంటూ జెలెన్ స్కీ మరో వీడియో ప్రకటన విడుదల చేశారు.
‘‘రష్యా చొరబాటుదారులు మమ్మల్ని ఓడించలేరు. అంతటి బలం వారి దగ్గర లేదు. అంత స్ఫూర్తి కూడా వారిలో లేదు. వారు కేవలం హింసను నమ్ముకున్నారు. కేవలం ఉగ్రవాదం, కేవలం ఆయుధాలు అవే వారి దగ్గర కావాల్సినన్ని ఉన్నాయి’’అని జెలెన్ స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం. జెలెన్ స్కీ ఇలాంటి వరుస రోజువారీ ప్రకటనలకు పరిమితం కావడమే కానీ.. రష్యాతో నిర్మాణాత్మక చర్చలు, యుద్ధాన్ని ఆపే దిశగా కృషి చేస్తున్నట్టు కనిపించడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.