Missile: భారత క్షిపణిని ఏ దశలోనూ గుర్తించలేకపోయిన పాకిస్థాన్ సైన్యం
- ఇటీవల పాక్ భూభాగంపై పడిన భారత క్షిపణి
- పొరబాటున పడిందన్న భారత్
- తాము ట్రాక్ చేశామన్న పాక్ సైన్యం
- అంతా వట్టిదే అని తేలిన వైనం
ఇటీవల భారత క్షిపణి ఒకటి పొరబాటున పాకిస్థాన్ భూభాగంలో పడడం తెలిసిందే. అయితే, ఈ క్షిపణిని భారత్ ప్రయోగించడం మొదలుకుని, పడిపోయేంతవరకు తమ గగనతల రక్షణ వ్యవస్థ ట్రాక్ చేసిందని పాక్ సైనిక ప్రతినిధి బాబర్ ఇఫ్తికార్ వెల్లడించారు. అయితే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం లేదన్న విషయం వెల్లడైంది.
క్షిపణి పొరబాటున ఫైర్ అయిన విషయాన్ని గుర్తించిన భారత్.... వెంటనే ఆ సమాచారాన్ని పాక్ వర్గాలకు తెలియజేసింది. క్షిపణి దూసుకువచ్చింది బుధవారం అయితే, పాక్ సైన్యం గురువారం నాడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వివరాలు తెలిపింది. ఓవైపు తాము ట్రాక్ చేశామంటూనే, ఆ మిస్సైల్ ప్రయాణ మార్గం, ట్రాజెక్టరీ డీటెయిల్స్ ఇవ్వాలని పాక్ సైన్యం భారత్ ను కోరింది. దాంతో పాక్ ఉత్తుత్తి ప్రకటన చేసినట్టు నిర్ధారణ అయింది.
అసలేం జరిగిందంటే... భారత వాయుసేనకు చెందిన ఓ సీక్రెట్ స్టేషన్ లో క్షిపణిని పరిశీలిస్తుండగా, పొరపాటున ఫైర్ అయింది. అది పాక్ భూభాగంలో 124 కిలోమీటర్లు ప్రయాణించి మియాన్ చన్నూ నగరంలో కూలిపోయింది. దీనిపై పాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, భారత్ వెంటనే స్పష్టత ఇచ్చింది.
కాగా, ఆ క్షిపణిలో ఎలాంటి పేలుడు పదార్థాలు అమర్చకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. అయినప్పటికీ తమ భూభాగంపై ఆస్తినష్టం జరిగిందని, తమ పౌరులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని పాక్ రుసరుసలాడింది. ఏదేమైనప్పటికీ ఓ క్షిపణి తమ గగనతలంలోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలు పాక్ వద్ద లేవన్నది దీంతో స్పష్టమైంది.