Perni Nani: బీజేపీ దిశానిర్దేశం కోసం వెయిటింగట..!: పవన్ పై పేర్ని నాని వ్యంగ్యం
- పవన్ వ్యాఖ్యలపై బదులిచ్చిన పేర్ని నాని
- చంద్రబాబును సీఎం చేయాలన్నదే పవన్ ప్రయత్నమని వెల్లడి
- చేతబడులు చేసేవాళ్లందరూ ఏకమవుతున్నారని వ్యాఖ్యలు
- జగన్ ఎప్పుడూ ఒంటరిగానే పోరాడతారని స్పష్టీకరణ
ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని, తద్వారా చంద్రబాబును సీఎం చేయాలన్న ఆయన తాపత్రయం వ్యక్తమవుతోందని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు.
జగన్ ను ఓడించేందుకు బీజేపీ నుంచి దిశానిర్దేశం కోసం వెయిటింగ్ అని పవన్ అంటున్నారని, జగన్ పై విషం చిమ్మడం ఒక్కటే వీరి అజెండా అని, అంతకుమించి పవన్ కు మరో అజెండా లేదని స్పష్టం చేశారు. జగన్ ను దించేందుకు రాజకీయ దుష్టశక్తులన్నీ ఏకమవుతున్నాయని, చేతబడులు చేసేవారందరూ కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. ఎంతమంది ఎదురొచ్చినా జగన్ ఒంటరిగానే పోరాడతారని పేర్ని నాని స్పష్టం చేశారు.
జనసేన కార్యకర్తలకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోందని, ఎప్పుడు ఎవరికి ఓటు వేయాలని చెప్పాలో వారికి అర్థంకావడంలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. "గతంలో సైకిల్ కు ఓటేయాలని చెప్పారు. మొన్నేమో కమలం, నిన్న మన గ్లాసు, ఒక ఊర్లోనేమో కత్తి సుత్తి, మరొక ఊర్లోనేమో కంకి కొడవలి, ఒక ఊర్లో ఏనుగు, ఇంకో ఊర్లో బాణం... ఇలా ఎప్పుడు ఏ గుర్తుకు ఓటేయమంటారో తెలియదు. రేపొద్దున మళ్లీ సైకిల్ అంటున్నాడు. జనసేన కార్యకర్తలకు ఎన్ని కష్టాలో పాపం. కానీ వైసీపీ కార్యకర్తలకు ఆ బాధ లేదు. ఉన్నది ఒకటే ఫ్యాన్ గుర్తు. మీకంటే ఊసరవెల్లి నయం పవన్ కల్యాణ్ గారూ.
ఇంకొకటి మర్చిపోయామండోయ్... అందరికీ నమస్కారం పెట్టాం కానీ లింగమనేని గారికి నమస్కారం పెట్టలేదు. పాపం ఏం చేశాడాయన? ఆఫీసుకు స్థలం ఇచ్చాడు. ఇంకెక్కడో బిల్డింగ్ కు అద్దె కడుతున్నాడు. ఇంకా ఏవేవో చేస్తున్నాడు... కానీ ఆయనకు కూడా నమస్కారం లేదు.
ఇక న్యాయవ్యవస్థ గురించి కూడా పవన్ అన్యాయంగా మాట్లాడారు. దేశం మొత్తం ప్రఖ్యాతిగాంచిన రిటైర్డ్ జడ్జి చంద్రుడు అనే వ్యక్తి గురించి టీడీపీ వాళ్లు బూతులు తిడితే మీరేం చేశారు? సినిమా డైలాగులే ఇవాళ సభలో మాట్లాడారు. అలాంటప్పుడు... నేను సింగిల్ కాదు చంద్రబాబుతో మింగిల్ అని చెప్పొచ్చు కదా.
జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలు అయితే, చంద్రబాబు చెప్పినట్టే మాట్లాడుతున్నాడు. టీడీపీ వాళ్లు అప్పు చేస్తే తప్పు కాదట... జగన్ మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే తప్పు అంటున్నాడు. మోదీ, అమిత్ షా వంటి వాళ్లు కేంద్రంలో అప్పులు చేయడంలేదా? మీ బీజేపీ వాళ్లు అప్పులు చేయకుండానే పరిపాలన చేస్తున్నారా? ఇప్పుడు కొత్తగా నామాలు పెట్టుకుని హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. మీరు, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం నడిపినప్పుడు హిందూ దేవాలయాల ధ్వంసం జరిగితే ఏనాడన్నా నోరు మెదిపారా?" అని నిలదీశారు.
పవన్ కల్యాణ్ ఏపీకి ఓ గెస్టులా, టూరిస్టులా మారారని, వచ్చి వెళ్లడం తప్ప ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు నిజాయతీ ఉంటే చంద్రబాబు కోసమే పనిచేస్తున్నానని చెప్పాలని డిమాండ్ చేశారు.