NASA: రష్యా వ్యోమనౌకలో వస్తున్న అమెరికా వ్యోమగామి!
- నేటితో 340 రోజులు గడిపిన వ్యక్తిగా మార్క్ వాండె
- ఈ నెల 30న సోయజ్ వ్యోమనౌకలో భూమికి
- రష్యాతో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్కంఠ
- మార్క్ అనుకున్న ప్రకారమే భూమికి చేరుతారన్న నాసా
ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో రష్యా-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన వ్యోమనౌకలో అమెరికా వ్యోమగామి తిరిగి భూమికి రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నేటితో కలుపుకుని 340 రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో గడిపిన అమెరికా వ్యోమగామి మార్క్ వాండె హెయ్ ఈ నెల 30న రష్యాకు చెందిన సోయజ్ వ్యోమనౌకలో భూమికి తిరిగి రావాల్సి ఉంది. అప్పటికి ఆయన 355 రోజులపాటు భూకక్ష్యలో గడిపినట్టు అవుతుంది. అంతరిక్షంలో అత్యధిక కాలం (438 రోజులు) గడిపిన వ్యోమగామి రికార్డు రష్యా పేరిట ఉంది. ఇప్పుడు మార్క్ 355 రోజులు గడపడం ద్వారా ఆ ఘనత సాధించిన తొలి అమెరికన్‌గా రికార్డులకెక్కబోతున్నారు.
ఈ నెల 30న సోయజ్ వ్యోమనౌకలో భూమికి రానున్న మార్క్ కజకస్థాన్లో ల్యాండవుతారు. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా-అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మార్క్ భూమికి తిరిగి రావడంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, మార్క్ మాత్రం తన ప్రయాణాన్ని వాయిదా వేయడం లేదని, అనుకున్న ప్రకారమే ఆయన భూమికి చేరుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది.
2011లో అమెరికా తన స్పేష్ షటిల్ కార్యక్రమానికి స్వస్తి చెప్పింది. అప్పటి నుంచి అంతరిక్ష యాత్రల కోసం రష్యాపైనే ఆధారపడుతోంది. 2020లో స్పేస్ ఎక్స్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేంత వరకు ఇదే జరిగింది. ఆ తర్వాత కూడా మార్పిడి విధానం కింద స్పేస్ఎక్స్ వ్యోమనౌకలో ఓ రష్యన్ వ్యోమగామి, సోయజ్లో ఒక అమెరికన్ వ్యోమగామి ప్రయాణిస్తున్నారు. అయితే, తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ‘మార్పిడి’ విధానంపై నీలినీడలు కమ్ముకున్నాయి.