cold war: రూ.1.24 లక్షల కోట్లు.. 25 ఏళ్ల పాటు కాపాడి.. తర్వాత కాల్చేశారు!
- జర్మనీలోని కోచెమ్ పట్టణంలో భారీ భూగర్భ బంకర్
- కోల్డ్ వార్ సమయంలో కరెన్సీ నిల్వ
- కోల్డ్ వార్ ముగిసిన తర్వాత కరెన్సీ ధ్వంసం
- నేడు మ్యూజియంగా మారిన బంకర్
చరిత్ర ఎన్నో ఆశ్చర్యాలు, అరుదైన విషయాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. అటువంటి వాటిల్లో జర్మనీలోని కోచెమ్ పట్టణంలో ఉన్న బంకర్ కూడా ఒకటి. అమెరికా-సోవియట్ యూనియన్ మధ్య ‘కోల్డ్ వార్’ నడిచిన సమయంలో జర్మనీ ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున ధనాన్ని బంకర్లో దాచి పెట్టింది. దేశ జీడీపీకి సమాన స్థాయిలో దాచి పెట్టడం విశేషం.
కోచెమ్ పట్టణ వాసులకు ఈ బంకర్ లో ఏం పెడుతున్నారన్నది కూడా నాడు తెలియకుండా గోప్యత పాటించారు. 15 బిలియన్లను (సుమారు రూ.1.25లక్షల కోట్లు ప్రస్తుత కరెన్సీ విలువ ప్రకారం), మరో 11 బిలియన్ల మేర ఆల్టర్నేటివ్ కరెన్సీని నాడు ఆ బంకర్లో జర్మనీ సెంట్రల్ బ్యాంకు దాచి పెట్టింది. 1963 లో జర్మనీ జీడీపీ 25 బిలియన్ డాలర్లుగా ఉంది.
బంకర్ కు బీబీకే-2 అని కోడ్ ఇచ్చారు. కోల్డ్ వార్ (భౌగోళిక రాజకీయ ఘర్షణ) సమయంలో జర్మనీ మానిటరీ వ్యవస్థపై దాడి జరిగితే ముందు జాగ్రత్తగా ఈ బంకర్ ను ఏర్పాటు చేసి.. పెద్ద ఎత్తున ధనాన్ని నిల్వ చేశారు. 1964 నుంచి పదేళ్ల పాటు వందలాది ట్రక్కుల్లో కరెన్సీ కట్టలను ఈ బంకర్ లోకి చేర్చారు. ఎవరూ అనుమానించలేని విధంగా నాడు ఈ రహస్య ఆపరేషన్ నిర్వహించారు.
18,300 బాక్సుల్లో బ్యాంకు నోట్లను ఉంచి భద్రపరిచారు. భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ బంకర్ విస్తీర్ణం 1,500 చదరపు మీటర్లు. 1989లో కోల్డ్ వార్ ముగింపునకు రావడంతో బంకర్ లోని నోట్లను బయటకు తీసి తగులబెట్టారు. అనంతరం ఈ బంకర్ ఒక కోపరేటివ్ బ్యాంకు చేతికి వెళ్లగా.. 2016లో పెట్రా రాయిటర్, మన్ ఫ్రెడ్ దంపతుల చేతికి వెళ్లి మ్యూజియంగా మారిపోయింది.