High Court: ఇదీ హిజాబ్ వివాదం.. ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే..!
- గత ఏడాది డిసెంబర్ 31న రాజుకున్న వివాదం
- ఉడుపి గవర్నమెంట్ పీయూ కాలేజీలో షురూ
- ఆరుగురు విద్యార్థినులను లోనికి రానివ్వని కాలేజీ
- ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లిన ఐదుగురు విద్యార్థినులు
- ఫిబ్రవరి 25న తీర్పు రిజర్వ్.. ఇవాళ తీర్పు
కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. చాలా మందిని చదువులకు దూరం పెట్టింది. గత ఏడాది డిసెంబర్ 31న రాజుకున్న వివాదం.. గాలివానలా మారింది. రెండు నెలల పాటు ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఆ వివాదాలకు చెక్ పెట్టేసింది. హిజాబ్ వేసుకురావొద్దంటూ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే అసలు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో చూద్దాం.
2021 డిసెంబర్ 31: ఉడుపిలోని గవర్నమెంట్ పీయూ కాలేజీలో ఆరుగురు విద్యార్థినులు హిజాబ్ వేసుకుని క్లాసులోకి వెళ్లారు. వద్దని టీచర్ వారించారు. కానీ, విద్యార్థినులు వినలేదు. టీచర్ వారిని బయటకు పంపించారు.
2022 జనవరి 1: కాలేజీ యాజమాన్యం అత్యవసర సమావేశం నిర్వహించి హిజాబ్ లను నిషేధించింది.
జనవరి 6: యూనిఫాంలో వచ్చిన విద్యార్థినులనే అనుమతించాలని ఐకాలలోని పాంపె కాలేజీ నిర్ణయించింది. కొంత మంది విద్యార్థులు.. హిజాబ్ కు పోటీగా కాషాయ కండువాలతో కాలేజీకి వచ్చారు.
జనవరి 13: హిజాబ్ ఉంటేనే క్లాసుకు వెళ్తామని 8 మంది విద్యార్థినులు ఉడుపిలోని ప్రభుత్వ పీయూ కాలేజీ ముందు ఆందోళన చేశారు. కేవలం యూనిఫాం, ఐడీ కార్డులతోనే కాలేజీకి వస్తామంటూ వారు డిక్లరేషన్ రాసిచ్చారంటూ కాలేజీ డైరెక్టర్ కు ఎమ్మెల్యే రఘుపతి భట్ లేఖ రాశారు.
జనవరి 19: హిజాబ్ ను ధరించి కాలేజీకి రావడంపై ఉడుపి కాలేజీ అనుమతి. అయితే, క్లాసు రూంలో మాత్రం నిషేధం. వేరే రూంలో మత దుస్తులను తీసేసి రావాలన్న సర్క్యులర్. ఒప్పుకోకుంటే ప్రభుత్వ ఆదేశాల వరకు ఆయా విద్యార్థులు ఆగాలని స్పష్టీకరణ.
జనవరి 20: విద్యార్థులు యూనిఫాం లేకుండా హిజాబ్ తో రావడమంటే క్రమశిక్షణను విస్మరించడమేనని కర్ణాటక ప్రాథమికోన్నత విద్యాశాఖ మంత్రి బి.సి. నగేశ్ వ్యాఖ్యలు.
జనవరి 25: యూనిఫాం, డ్రెస్ కోడ్ ను నిర్ణయించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. అప్పటివరకు యథాతథ స్థితిని అమలు చేయాలని నిర్ణయం.
జనవరి 28: ఉడుపి ప్రభుత్వ పీయూ కాలేజీ విద్యార్థినులు.. ముస్లిం మతపెద్దలతో సమావేశం. విద్యార్థినులకే మద్దతు ప్రకటించిన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా.
జనవరి 31: హిజాబ్ వేసుకుని క్లాసులకు వచ్చేవారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే రఘుపతి భట్ హెచ్చరిక. అదే రోజు హైకోర్టులో పిటిషన్ వేసిన ఉడుపి గవర్నమెంట్ పీయూ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినులు.
ఫిబ్రవరి 1: హిజాబ్ తో వచ్చిన ఆరుగురు విద్యార్థినులకు క్లాసులోకి అనుమతి నిరాకరణ.
ఫిబ్రవరి 2: కుందాపూర్ లోని మరో ప్రభుత్వ కాలేజీలో వివాదం. హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చిన 28 మంది అమ్మాయిలు. దానికిపోటీగా కాషాయ కండువాలతో 50 మంది అబ్బాయిల ప్రదర్శన. హిజాబ్ వేసుకుని వచ్చినందుకు శివమొగ్గలోని భద్రావతిలో ఉన్న సర్ ఎం.వి. గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన.
ఫిబ్రవరి 3: హిజాబ్ వేసుకుని వచ్చిన 28 మంది విద్యార్థినులను అనుమతించని కుందాపూర్ జూనియర్ కాలేజీ యాజమాన్యం. అది భండార్కర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి పాకింది.
ఫిబ్రవరి 4: కాషాయ కండువాలతో కాలేజీకి వచ్చిన రామదుర్గలోని గవర్నమెంట్ పీయూ కాలేజీ విద్యార్థులు.
ఫిబ్రవరి 8: ఉడుపిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీలో కొందరు హిందూ విద్యార్థులు కాషాయ తలపాగా, కాషాయ కండువాలతో పోటీగా నిరసనలు. విద్యార్థుల పిటిషన్ విచారణ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.
ఫిబ్రవరి 9: హిజాబ్ వివాదంపై విచారణ జరిపేందుకు ఫుల్ కోర్టును నియమించిన చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి.
ఫిబ్రవరి 10: కర్ణాటక హైకోర్టు విచారణలో ఉన్న పిటిషన్లను తాము విచారించలేమని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.
ఫిబ్రవరి 14: కర్ణాటకలో స్కూల్స్ పున:ప్రారంభం. క్యాంపస్ లోకి ఎంటరయ్యే ముందు హిజాబ్, బుర్ఖాలు తీసేసి రావాలంటూ టీచర్ల ఆదేశాలు.
ఫిబ్రవరి 16: వారం రోజులు మూతపడిన తర్వాత ప్రీ యూనివర్సిటీ కాలేజీలు, స్కూళ్ల పున:ప్రారంభం.
ఫిబ్రవరి 23: మధ్యంతర ఉత్తర్వులు అన్ని విద్యాసంస్థలకూ వర్తిస్తుంది. యూనిఫాంలోనే రావాలంటూ యాజమాన్యాలు ఎప్పుడైనా ప్రకటించేందుకు అధికారం ఉంటుంది.
ఫిబ్రవరి 25: హిజాబ్ వివాదంపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.
మార్చి 15: హిజాబ్ మత ఆచారం కాదని, విద్యార్థినులంతా యూనిఫాంలోనే రావాలని తీర్పు.