Kapil Sibal: కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి గాంధీలు తప్పుకోవాలి: కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు
- 2014 ఎన్నికల నుంచి అన్ని ఎన్నికల్లో ఓడిపోతూనే ఉన్నాం
- కొత్త వ్యక్తికి బాధ్యతలను అప్పగించాలి
- సీడబ్ల్యూసీలో ఉన్నవారికి మాత్రమే పార్టీ నాయకత్వంపై నమ్మకం ఉంది
కాంగ్రెస్ పార్టీ ప్రాభవం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఏ ఎన్నికలు జరిగినా చాలా దారుణమైన ఫలితాలను చవిచూస్తోంది. మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలుపొందింది. మరోవైపు ఇప్పటికే పార్టీ అధిష్ఠానంపై సీనియర్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈరోజు పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి గాంధీలు తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరొక వ్యక్తికి నాయకత్వాన్ని అప్పగించాలని చెప్పారు.
2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్ని సందర్భాల్లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోతూనే ఉందని సిబాల్ అన్నారు. సీడబ్ల్యూసీలో ఉన్నవారు మాత్రమే పార్టీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని... సీడబ్ల్యూసీ వెలుపల ఉన్నవారు కొత్త వ్యక్తికి పార్టీ పగ్గాలను అప్పగించాలని కోరుకుంటున్నారని చెప్పారు.
పార్టీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని కోరుతూ సోనియాగాంధీకి గతంలో రాసిన లేఖపై సంతకం చేసిన వారిలో కపిల్ సిబాల్ కూడా ఉన్నారు. అయితే ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ పార్టీ నాయకత్వాన్ని మార్చాలనే అంశాన్ని ప్రస్తావించలేదు.