Madras Hihg Court: ఆఫీసుల్లో మొబైల్ వాడ‌కంపై మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

madras high court sensational verdict on mobile phone using in offices

  • ఆఫీసులోనే మొబైల్‌తో వీడియోలు తీసిన ఉద్యోగి
  • స‌స్పెన్ష‌న్ వేటుతో హైకోర్టును ఆశ్రయించిన వైనం
  • ఆఫీసుల్లో మొబైల్ వినియోగించ‌రాదంటూ హైకోర్టు తీర్పు
  • అందుకు విధి విధానాల రూప‌కల్ప‌న‌కు ఆదేశం
  • నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మిస్తే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచ‌న‌

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఉద్యోగులు మొబైల్ ఫోన్ల వినియోగించ‌రాదంటూ మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఆఫీసు ప‌ని వేళల్లో వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం మొబైల్‌ను వినియోగించ‌రాదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ త‌ర‌హా నిషేధానికి సంబంధించిన విధివిధానాల‌ను రూపొందించాలంటూ తమిళ‌నాడు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్ర‌భుత్వం రూపొందించే స‌ద‌రు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించే వారిపై చ‌ర్య‌లు తీసుకునేలా కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేర‌కు మ‌ద్రాస్ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్ఎం సుబ్ర‌హ్మ‌ణియ‌మ్ నేతృత్వంలోని బెంచ్ సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. తిరుచిరాప‌ల్లి హెల్త్ రీజ‌న‌ల్ వ‌ర్క్ విభాగంలో సూప‌రింటెండెంట్‌గా ప‌నిచేస్తున్న ఓ అధికారి విధి నిర్వ‌హ‌ణ‌లో ఉండ‌గానే... ఆఫీసులోనే తోటి ఉద్యోగుల వీడియో తీశాడ‌ట‌. ఉద్యోగులు ఎంత‌గా వారించినా కూడా స‌ద‌రు అధికారి విన‌లేదు‌. దీంతో ఉద్యోగుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఉన్న‌తాధికారులు ఆ అధికారిని స‌స్పెండ్ చేశారు‌. త‌న‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను ఎత్తేయాల‌ని కోరుతూ ఆ అధికారి దాఖ‌లు చేసిన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా జ‌స్టిస్ సుబ్ర‌హ్మ‌ణియ‌మ్ ఈ తీర్పు చెప్పారు. 

విచార‌ణ సందర్భంగా న్యాయమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆఫీసుల్లో అది కూడా విధి నిర్వ‌హ‌ణ‌లో ఉండ‌గా.. ఫోన్ల‌లో మాట్లాడ‌టం, వీడియోలు, ఫొటోలు తీయడం ఇత‌ర ఉద్యోగుల‌కు ఇబ్బంది క‌లిగించ‌డ‌మేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ త‌ర‌హా వ్య‌వ‌హారం ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌కు కూడా ఆటంకం క‌లిగించేదేన‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌ని, ప్ర‌భుత్వ ఉద్యోగులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని న్యాయ‌మూర్తి అన్నారు. ప‌నిచేస్తున్న‌పుడు వీల‌యితే సెల్ ఫోన్‌ను స్విచాఫ్ చేయాలని.. లేదంటే సైలెంట్ లో గానీ వైబ్రేష‌న్‌లో గానీ పెట్టాల‌ని సూచించారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఫోన్ మాట్లాడాల్సి వ‌స్తే.. పై అధికారి అనుమ‌తి తీసుకుని ఆఫీస్ బ‌య‌ట‌కు వెళ్లి ఫోన్ మాట్లాడి రావాల‌ని న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News