Congress: యూపీసీసీ నేతలతో ప్రియాంక భేటీ.. ఓటమిపై పోస్టుమార్టం
- ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి ఓటమి
- యూపీలో ఓటమిపై ప్రియాంక దృష్టి
- పార్టీ రాష్ట్ర శాఖ నేతలతో ప్రత్యేక భేటీ
ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై ఇప్పటికే సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ కీలక నేతలు చర్చించారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషించారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలన్న దానిపై కూడా చర్చించారు. తాజాగా అలాంటి భేటీనే పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ ప్రియాంకా గాంధీ వాద్రా మంగళవారం నిర్వహించారు.
దేశ రాజకీయాలను మలుపు తిప్పగలిగిన రాష్ట్రంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్లో గడచిన కొంత కాలంగా కాంగ్రెస్ అసలు ప్రభావమే చూపలేకపోతోంది. కనీసం పార్టీ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నియోజకవర్గాల్లోనూ పార్టీ గెలవడం లేదు. ఈ దఫా కూడా రాయబరేలీ, అమేథీల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.
ఈ క్రమంలో అసలు యూపీలో పార్టీకి ఇంతటిఘోర పరాభవం ఎదురు కావడానికి గల కారణాలేమిటన్న విషయంపై ప్రియాంక మంగళవారం నాటి భేటీలో చర్చించారు. పార్టీ యూపీ శాఖకు చెందిన కీలక నేతలంతా పాలుపంచుకున్న ఈ భేటీలో ఏమేం నిర్ణయాలు తీసుకున్నారన్న విషయం తెలియాల్సి ఉంది.