India: రష్యా నుంచి చౌకగా చమురు.. త్వరలో డీల్!
- మార్కెట్ కంటే తక్కువ ధరకే
- 25-30 శాతం తక్కువకు ఇస్తామన్న రష్యా
- రవాణా, బీమా బాధ్యత ఆ దేశానిదే
- 3.5 మిలియన్ బ్యారెళ్ల కొనుగోలుకు అవకాశం
రష్యా ఇచ్చిన ఆఫర్ కు భారత్ త్వరలో అంగీకారాన్ని తెలియజేయనుంది. భారత్ కు మార్కెట్ ధర కంటే 25-30 శాతం తక్కువ రేటుకే చమురును సరఫరా చేస్తామంటూ కొన్ని రోజుల క్రితం రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమ దేశాలు పెద్ద మొత్తంలో ఆర్థిక ఆంక్షలను ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. దీంతో తనకు మిత్రదేశమైన భారత్ కు రష్యా ఈ ఆఫర్ చేసింది.
3.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ప్రస్తుత మార్కెట్ ధర (100 డాలర్లు)తో పోలిస్తే చాలా చౌకగా తీసుకోనున్నట్టు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. చమురును భారత్ తీరానికి చేర్చడంతో పాటు, రవాణా సమయంలో బీమా భద్రతను రష్యాయే తీసుకోనుంది. రష్యాతో మన ఆయిల్ కంపెనీలు లోగడ పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోకపోవడానికి అడ్డంకుల్లో ఇవీ ఉన్నాయి. ఇప్పుడు ఈ బాధ్యతలను రష్యానే తీసుకుంటోంది కనుక ఆ దేశంతో ఒప్పందాలకు అడ్డంకులు తొలగిపోయినట్టే.
మన దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. కనుక రష్యాతో తక్కువ ధరలకే డీల్ చేసుకుంటే అది దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గేందుకు దోహదపడనుంది.