TDP: కల్తీమద్యంతో ఏపీలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.. చర్యలు తీసుకోండి: లోక్సభలో రామ్మోహన్నాయుడు
- మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారు
- ఇప్పుడు ప్రభుత్వం ద్వారానే మద్యాన్ని విక్రయిస్తున్నారు
- రాష్ట్రంలో మద్యం మాఫియా, బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయిందన్న రామ్మోహన్
ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ విషయంలో కేంద్రం తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్నాయుడు కోరారు. లోక్సభ జీరో అవర్లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన జగన్.. వచ్చాక ప్రభుత్వం ద్వారానే మద్యం వ్యాపారం చేయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే వ్యక్తులతో చౌకబ్రాండ్లు సృష్టించి మరీ విక్రయిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో మద్యం మాఫియా, బ్లాక్ మార్కెటింగ్ పెరిగేందుకు ఇది మరింత దోహదం చేసిందన్నారు. కల్తీ మద్యం విక్రయాలు కూడా రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయాయని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీమద్యం తాగి 18 మంది చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇది ప్రజల ప్రాణాలతో ముడిపడిన విషయం కాబట్టే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చానన్నారు. వెంటనే ఈ విషయంలో చర్యలు చేపట్టాలని రామ్మోహన్నాయుడు కోరారు.