CORBEVAX: 'కార్బెవ్యాక్స్’ టీకా పిల్లలకు సురక్షితం.. అధిక యాంటీబాడీల రక్షణ: బయోలాజికల్ ఈ లిమిటెడ్
- అధిక యాంటీబాడీల ఉత్పత్తి
- చౌకగా సరఫరా చేస్తున్నాం
- ఎక్స్ పర్ట్ కమిటీలకు క్లినికల్ డేటా
- బీఈ ఎండీ మహిమ దాట్ల వెల్లడి
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా, పరిశోధన సంస్థ బయోలాజికల్ ఈ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కార్బెవ్యాక్స్ టీకాను 12-14 సంవత్సరాల పిల్లలకు ఇవ్వడాన్ని బుధవారం నుంచి ప్రారంభించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. సంస్థ ఎండీ మహిమ దాట్ల టీకాకు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించారు.
పిల్లలకు ఈ టీకా సురక్షితమేనంటూ, ఇతర వెక్టార్ టీకాలతో పోలిస్తే అధిక యాంటీ బాడీల ఉత్పత్తికి తోడు ఇమ్యూనిటీ రక్షణనిస్తున్నట్టు చెప్పారు. భారత ఔషధ నియంత్రణ మండలి, సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీలతో ప్రతి దశలోనూ క్లినికల్ డేటా సమాచారాన్ని పంచుకున్నట్టు చెప్పారు. అలాగే, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు (ఎన్టీఏజీఐ)నకు కూడా డేటా ఇచ్చామని ఆమె తెలిపారు. ఎన్టీఏజీఐ కోరితే మరింత సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అన్ని రకాల పన్నులతో ప్రైవేటుగా మార్కెట్లో రూ.800కు విక్రయిస్తున్నామని, ప్రభుత్వానికి రూ.145కే సరఫరా చేస్తున్నామని చెప్పారు.