Ukraine: మెలిటోపోల్ మేయర్ ను విడుదల చేసిన రష్యా దళాలు.. ఫలితంగా ఉక్రెయిన్ ఏం చేసిందంటే..!
- గత శుక్రవారం మేయర్ ఇవాన్ ఫెడొరోవ్ కిడ్నాప్
- ఈరోజు ఆయనను విడుదల చేసిన వైనం
- బదులుగా తొమ్మిది మంది రష్యా సైనికులను విడుదల చేసిన ఉక్రెయిన్
ఉక్రెయిన్ లోని మెలిటోపోల్ నగర మేయర్ ను రష్యా బలగాలు కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఆయనను రష్యా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. కిడ్నాప్ చేసి ఆయనను తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ద్నిప్రోరుడ్నే నగర మేయర్ ను కూడా రష్యా సైనికులు కిడ్నాప్ చేశారు.
మరోవైపు ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడొరోవ్ ను రష్యా బలగాలు ఈరోజు విడుదల చేశారు. దీనికి బదులుగా తమ వద్ద బందీలుగా ఉన్న తొమ్మిది మంది రష్యా సైనికులను ఉక్రెయిన్ బలగాలు విడుదల చేశాయి.
విడుదలైన రష్యా సైనికులంతా 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. పౌరులు కచ్చితంగా సైన్యంలో పని చేయాలనే నిబంధన కింద వీరు రష్యా సైన్యంలో నియమితులయ్యారు. వీరంతా 2002-03 మధ్యలో జన్మించారని ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు ఇలాంటి వారిని ఉక్రెయిన్ లో విధులకు పంపలేదని యుద్ధం తొలినాళ్లలో రష్యా తెలిపింది.