USA: పుతిన్ పై బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు.. బైడెన్ పై రష్యా మండిపాటు
- పుతిన్ యుద్ధ నేరస్థుడన్న బైడెన్
- మూల్యం చెల్లించుకుంటారంటూ హెచ్చరిక
- బైడెన్ వి క్షమించరాని వ్యాఖ్యలన్న రష్యా
- రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా మధ్య మాటల యుద్ధం రాజుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను యుద్ధ నేరస్థుడంటూ బైడెన్ మండిపడ్డారు. ఉక్రెయిన్ కు 80 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేస్తామని, యుద్ధ సామగ్రిని అందజేస్తామని, డ్రోన్లు ఇస్తామని ఆయన చెప్పారు. డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందిని బందీలుగా చేశారన్న వార్తలపై స్పందించిన ఆయన.. ఉక్రెయిన్ పై చేస్తున్న అరాచకాలకు పుతిన్ తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తామని హెచ్చరించారు.
అయితే, బైడెన్ వ్యాఖ్యలను రష్యా ప్రెస్ సెక్రటరీ ఖండించారు. బైడెన్ వ్యాఖ్యలు క్షమించరానివని మండిపడ్డారు. బైడెన్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావన్నారు.