Russia: ఎంతకీ లొంగని ఉక్రెయిన్ పైకి నేవీని రంగంలోకి దింపిన రష్యా
- ఇప్పటివరకు భూతల, గగనతల దాడులు చేసిన రష్యా
- ఒడెస్సా నగర శివార్లపై రష్యా యుద్ధ నౌకల దాడులు
- రష్యా యుద్ధ నౌకల కదలికలను గుర్తించిన అమెరికా, జపాన్
వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలో రష్యా గత మూడు వారాలుగా జరుపుతున్న దాడులు ఉక్రెయిన్ స్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేకపోయాయి. దాంతో, ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలన్న వ్యూహంతో రష్యా తాజాగా నావికా దళాన్ని రంగంలోకి దించింది. పలు రష్యా యుద్ధ నౌకలు భారీ ఆయుధాలతో ఉక్రెయిన్ తీరాన్ని సమీపిస్తున్నాయి. ఉక్రెయిన్ తీర ప్రాంతాల్లో మోహరించేందుకు వీలుగా, పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, క్షిపణులను మోసుకుని వస్తున్నాయి. ఉత్తర నల్ల సముద్రంలో యుద్ధ నౌకల కదలికలు తీవ్రమయ్యాయని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది.
కాగా, రష్యన్ యుద్ధ నౌకలు ఉక్రెయిన్ లోని ఒడెస్సా నగర శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు నిర్వహించాయి. రష్యా సేనలు ఒడెస్సా నగరంలోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం చేయడమే నౌకదాళ దాడుల ఉద్దేశమని పెంటగాన్ వివరించింది. అటు, జపాన్ కూడా సముద్ర జలాల్లో రష్యా యుద్ధ నౌకల శ్రేణిని గుర్తించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అవి ఉక్రెయిన్ దిశగా వెళుతున్నట్టు భావిస్తున్నామని పేర్కొంది.