KS Rama Rao: ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు: సినీ నిర్మాత కేఎస్ రామారావు కీలక వ్యాఖ్యలు
- సినీ పరిశ్రమలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం ఎక్కడా లేదు
- ఏపీలో మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది
- ఏపీలో వచ్చే కలెక్షన్లను బట్టే సినిమా బడ్జెట్ ను నిర్ణయించుకోవాలి
సినీ పరిశ్రమ విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం ప్రపంచంలో ఎక్కడాలేదని... ఏపీలో మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ప్రముఖ సినీ నిర్మాత కేఎస్ రామారావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని అన్నారు. సినీ వ్యవహారాల్లో ప్రభుత్వానిది అనవసరమైన జోక్యమని పేర్కొన్నారు. ఇకపై ఏపీలో వచ్చే కలెక్షన్లను బట్టే సినిమా బడ్జెట్ ను నిర్ణయించుకోవాలని సూచించారు. ఎక్కువ బడ్జెట్ పెట్టి నష్టపోవద్దని చెప్పారు.
విశాఖలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కు గత ఆరేళ్లుగా తానే అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నానని ... రాజకీయాలకు అతీతంగా సెంటర్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. కల్చరల్ సెంటర్ పై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని... రూ. 30 కోట్లు దుర్వినియోగమయ్యాయని చెప్పడం అవాస్తవమని అన్నారు. అవగాహన లేనివారు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కల్చరల్ సెంటర్ లో 1,250 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడాలనేదే తన ఉద్దేశమని తెలిపారు.