Center: కరోనా ఫోర్త్ వేవ్ పట్ల రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
- ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా విజృంభణ
- చైనాలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్
- దక్షిణ కొరియాలో ఒక్కరోజులో 6 లక్షల కేసులు
- ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలన్న కేంద్రం
ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఫోర్త్ వేవ్ పట్ల అప్రమత్తమైంది. చైనాలో కొత్త కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుండగా, దక్షిణ కొరియాలో ఒక్కరోజే 6 లక్షలకు పైగా కేసులు, 400కి పైగా మరణాలు సంభవించడం కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందో చాటుతోంది.
దీనిపై కేంద్రం స్పందిస్తూ... రాష్ట్రాలకు హెచ్చరికలు చేసింది. కరోనా వైరస్ ను తక్కువగా అంచనా వేసి నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేసింది. కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని, కరోనా మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని సూచించింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, కరోనా నియమావళి, వ్యాక్సినేషన్... విధానంలో ఐదు అంచెల వ్యూహాన్ని మళ్లీ అమలు చేయాలని పేర్కొంది.
ముఖ్యంగా, బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాలని కేంద్రం స్పష్టం చేసింది. భారత్ లో ప్రస్తుతం కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి పడిపోయినప్పటికీ, ప్రపంచదేశాలు మళ్లీ సతమతమవుతుండడంతో తాజా హెచ్చరికలు చేసింది.