Janasena: జనసేన పబ్లిక్ పాలసీ విశ్లేషకుడిగా బుర్రా నాగ త్రినాధ్ నియామకం
- విశాఖకు చెందిన బుర్రా నాగ త్రినాధ్
- జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర
- పబ్లిక్ పాలసీ అధ్యయనంపై 5 వేల గ్రామాల్లో పర్యటన
- జనసేన యువ నాయకత్వంలో మూడేళ్ల పాటు శిక్షణ
- పబ్లిక్ పాలసీ విశ్లేషకుడితో పాటు అధికార ప్రతినిధి పోస్టు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో కొత్త నియామకాల జోరు కొనసాగుతోంది. పార్టీ ఆవిర్భావ వేడుకలు ముగిసిన నేపథ్యంలో వరుసగా కొత్త నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రాయపాటి అరుణను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించిన పవన్.. తాజాగా విశాఖకు చెందిన బుర్రా నాగ త్రినాధ్‌ను పార్టీ అధికార ప్రతినిధి, పబ్లిక్ పాలసీ విశ్లేషకుడిగా నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. అధికార ప్రతినిధి పదవి పాతదే అయినా.. కొత్తగా పబ్లిక్ పాలసీ విశ్లేషకుడి పదవిని సృష్టించిన పవన్.. ఆ పోస్టులో బుర్రాను నియమించారు.
ఇక బుర్రా నాగ త్రినాధ్ విషయానికి వస్తే.. విశాఖకు చెందిన ఆయన ఉన్నత విద్యావంతుడు. తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ మంచి ప్రావీణ్యం ఉందట. యువజన నాయకుడిగా కామన్వెల్త్ యువజన మండలిలో డిప్యూటీ హెడ్‌గా పనిచేసిన బుర్రా.. 53 దేశాలకు సేవలు అందించారు. పబ్లిక్ పాలసీ అధ్యయనంలో భాగంగా దాదాపుగా 5 వేల గ్రామాల్లో పర్యటించారు.
పలు జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. పవన్ నేతృత్వంలోని జనసేన యువ నాయకత్వం విభాగంలో మూడేళ్ల శిక్షణ పొందారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న బుర్రాను పార్టీ పబ్లిక్ పాలసీ విశ్లేషకుడిగా నియమిస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.