Congress: సోనియా ఇంటికి ఆజాద్!.. కాంగ్రెస్లో అసంతృప్తి చల్లారినట్టేనా?
- ఐదు రాష్ట్రాల్లో ఓటమిపై పార్టీలో అసంతృప్తి
- స్వయంగా గాంధీ ఫ్యామిలీనే కారణమన్న వాదనలు
- ఈ దిశగానే పలువురు సీనియర్లు ఆజాద్ ఇంటిలో భేటీ
- నేడు సోనియాతో ఆజాద్ భేటీతో సమస్య కొలిక్కి?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీలో తలెత్తిన అసంతృప్తి సెగలు కాంగ్రెస్లో చల్లారినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గడచిన నాలుగైదు రోజులుగా పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కపిల్ సిబల్ లాంటి సీనియర్లంతా పార్టీ కీలక నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. వీరి వరుస భేటీల నేపథ్యంలో పార్టీలో చీలిక తప్పదేమోనన్న వాదనలు కూడా వినిపించాయి.
అయితే శుక్రవారం నాడు ఇలాంటి వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టేలా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. ఒంటరిగానే 10 జన్ పధ్ కు వచ్చిన ఆజాద్.. సోనియాతో భేటీ అయ్యారు. గాంధీ కుటుంబం వల్లే పార్టీకి ఘోర పరాభవం తప్పలేదని వాదిస్తున్న వర్గానికి దాదాపుగా నాయకత్వం వహిస్తున్నట్లుగా భావిస్తున్న ఆజాద్ స్వయంగా సోనియా గాంధీతో భేటీ అయిన నేపథ్యంలో అసంతృప్త గళం చల్లారిపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.