Pawan Kalyan: ప్రజల మంచి కోరి పాలన చేస్తున్నట్టు ఏ కోశానా అనిపించడంలేదు: పవన్ కల్యాణ్
- ప్రభుత్వంపై పవన్ విమర్శనాస్త్రాలు
- పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతారా? అంటూ వ్యాఖ్యలు
- ఆసక్తికర ఫొటోలు ట్వీట్ చేసిన వైనం
- కర్నూలులో దుకాణాల ముందు చెత్తపోసిన ఘటనపైనా స్పందన
జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వ యంత్రాంగంపై ధ్వజమెత్తారు. ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్టు ఏ కోశానా కనిపించడంలేదని విమర్శించారు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లు ట్రాక్టర్లు వేసుకుని తిరగడం దేన్ని సూచిస్తోంది? అంటూ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని ఫొటోలు పంచుకున్నారు. అందులో... పన్ను కట్టని వాళ్ల సామాన్లు తీసుకుపోతామని మున్సిపల్ వాహనాలకు బ్యానర్లు కట్టడాన్ని చూడొచ్చు. దీనిపై పవన్ స్పందిస్తూ... వీటిని చూస్తుంటే డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునేవాళ్ల ఆలోచనలా ఉందని పేర్కొన్నారు.
అంతేకాదు, కర్నూలు నగరంలో అనంత కాంప్లెక్స్ ముందు చెత్త పోసిన ఘటనపైనా స్పందించారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చదని వ్యాఖ్యానించారు. చెత్త పన్ను విధింపే ఒక దరిద్రం అనుకుంటే, ఆ పన్ను వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉందని విమర్శించారు. "కర్నూలులో వ్యాపారులు పన్ను చెల్లించలేదని, సిటీలోని చెత్తను తీసుకువచ్చి దుకాణాల ముందు పోసి అవమానిస్తారా? ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే" అని స్పష్టం చేశారు.