Revanth Reddy: మెదక్ చేరుకున్న మధ్యప్రదేశ్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. పాల్గొని కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
- భూదాన్ ఉద్యమానికి 75 ఏళ్లు
- ఈ సందర్భంగా పాదయాత్ర
- తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతోందన్న రేవంత్ రెడ్డి
- భూములు దోచుకుంటున్నారంటూ ఆగ్రహం
భూదాన్ ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ మధ్యప్రదేశ్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పాదయాత్ర మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ కు చేరుకుంది. దేశంలోని దళితులు, గిరిజనులతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఆమెకు పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు మద్దతు తెలుపుతున్నారు.
ఈ పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో రైతులు, దళితులు, గిరిజనులతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
మరోవైపు, టీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల పేర్లతో రైతుల నుంచి భూములు లాక్కుందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన బంధువు కోసమే కొండపోచమ్మను రీడిజైన్ చేశారని అన్నారు. ఆ ప్రాజెక్టు నుంచి నీరు కేసీఆర్ ఫాంహౌస్‌కు మాత్రమే వెళ్తున్నాయని తెలిపారు.
ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు) పేరుతో ఇప్పుడు మళ్లీ భూములు లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల నుంచి రూ.3 కోట్ల విలువైన భూములను లాక్కుని రూ.10 లక్షలు ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. రైతులను వరి పండించకూడదని చెప్పిన కేసీఆర్ తన ఫాంహౌస్‌లో మాత్రం వరి పండించారని చెప్పారు. కేసీఆర్ పాలనలో రైతుల భూమికి విలువలేకుండా పోయిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయట్లేదని చెప్పారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమితో పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని, ఆయనను ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరపడ్డాయని రేవంత్ మండిపడ్డారు.