Anitha: 'కాలకేయుల్లా మహిళలపై వైసీపీ నేతల అఘాయిత్యాలు'.. అంటూ టీడీపీ నాయకురాలు అనిత బహిరంగ లేఖ
- మచిలీపట్నంలో వీవోఏ ఆత్మహత్య
- వైసీపీకి చెందిన వ్యక్తి వేధిస్తున్నాడని నాగలక్ష్మి ఫిర్యాదు
- అయినా పోలీసులు స్పందించలేదు
- వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారని అనిత ప్రశ్న
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతలు కాలకేయుల మాదిరిగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటూ సీఎం జగన్‌కు టీడీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత బహిరంగలేఖ రాశారు. మచిలీపట్నంలో వీవోఏ ( విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్)గా పనిచేస్తున్న నాగలక్ష్మి తనను వైసీపీకి చెందిన వ్యక్తి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని ఆమె విమర్శించారు.
నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యే అని ఆమె విమర్శించారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై ఆమె ఫిర్యాదు చేశారని తెలిపారు. వైసీపీ పాలనలో మహిళలపై 1,500కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయని చెప్పారు. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోందని ఆమె నిలదీశారు. జగన్ సర్కారు తీసుకొచ్చిన దిశ చట్టం కింద ఒక్క నేరస్థుడికైనా శిక్ష విధించారా? అని ఆమె ప్రశ్నించారు.
ఏపీలో పెరిగిపోతోన్న దారుణాలకు ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని ఆరోపించారు. మహిళలకు అన్యాయం జరుగుతుంటే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు. హోంమంత్రిగా ఓ మహిళ ఉన్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.