Vishnu Vardhan Reddy: రణభేరి మొదలవక ముందే మంత్రి సురేశ్ గారి గుండెల్లో గుబులు ఎందుకు మొదలైంది?: విష్ణువర్ధన్ రెడ్డి
- నేడు బీజేపీ రాయలసీమ రణభేరి సభ
- వైసీపీ నేతలు ఇప్పుడే ఎందుకు స్పందిస్తున్నారు?
- రాయలసీమలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు
- అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేకపోవడంతోనే విమర్శలన్న విష్ణువర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో నేడు బీజేపీ 'రాయలసీమ రణభేరి' సభ నిర్వహిస్తోంది. రాయలసీమలో కొనసాగాల్సిన ప్రాజెక్టులపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఈ రణభేరి సభ నిర్వహిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం వరుస ఆందోళనలు చేపట్టే ప్రణాళికలను కూడా దీని ద్వారా బీజేపీ ప్రకటించనుంది.
రాయలసీమ జిల్లాల బీజేపీ నేతలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ సభ నిర్వహిస్తుంటే, ఈ సభ ప్రారంభం కాకముందే, తాము మాట్లాడకముందే మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో పాటు వైసీపీ నేతలు ఎందుకు స్పందిస్తున్నారో, తమపై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారో తమకు అర్థం కావట్లేదని చెప్పారు.
రాయలసీమలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో, అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేకపోవడంతోనే వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ సభకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని, తమ సభకు వచ్చే వారిని బెదిరిస్తున్నారని, సంక్షేమ పథకాలు అందకుండా ఆపేస్తామని అంటున్నారని ఆయన విమర్శించారు.
రాయలసీమకు వైసీపీ చేసిన మోసాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఈ సభ పట్ల వైసీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారని ఆరోపించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని, ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి చేయలేదని అన్నారు. రాయలసీమ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని విమర్శించారు. వీటన్నింటిపైనా తాము ప్రశ్నిస్తామనే వైసీపీ నేతలు మండిపడుతున్నారని ఆయన అన్నారు. రాయలసీమ రణభేరి మొదలవక ముందే మంత్రి సురేశ్ గారి గుండెల్లో గుబులు ఎందుకు మొదలైంది? అని ఆయన ప్రశ్నించారు.