Oil: చమురు వాడకాన్ని తగ్గించాలని అన్ని దేశాలకూ అంతర్జాతీయ ఇంధన సంస్థ ఆదేశాలు
- రోజూ 27 లక్షల బ్యారెళ్లు ఆదా చేయాలని సూచన
- ఏ చర్యతో ఎంత ఆదా అవుతుందో వివరణ
- పది పాయింట్ల ఎజెండాతో పలు సూచనలు
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఎఫెక్ట్ తో చాలా దేశాలకు చమురు సరఫరాపై పెద్ద ప్రభావమే పడింది. రష్యా నుంచి సప్లై ఆగిపోవడంతో చాలా దేశాలకు కొరత ఏర్పడుతోంది. బ్యారెల్ ముడి చమురు ధరలూ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) పలు సూచనలు చేసింది. రోజువారీ చమురు వాడకాన్ని తగ్గించేయాలని ప్రపంచ దేశాలకు ఆదేశాలిచ్చింది. అంతేకాదు, పది పాయింట్ల ఎజెండాను ప్రపంచ దేశాల ముందు పెట్టింది.
రోజువారీ వినియోగంలో 27 లక్షల బ్యారెళ్ల చమురుకు కోత విధించాలని పేర్కొంది. ఈ నాలుగు నెలలూ ఇలాగే చేయాలని సూచనలిచ్చింది. 2050 నాటికి ఉద్గారాలను జీరోకు తీసుకురావాలన్న లక్ష్యంతో దీనిని అవకాశంగా తీసుకోవాలని, ఇప్పట్నుంచే చమురు వాడకాన్ని తగ్గించడం మొదలుపెట్టాలని పేర్కొంది.
వినియోగదారుల ధోరణిలో మార్పులు తీసుకొచ్చేందుకే పది పాయింట్ల ఎజెండాను తీసుకొచ్చామని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫెయిత్ బిరోల్ చెప్పారు. భవిష్యత్ చమురు సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఐఈఏ సూచించిన పది పాయింట్లివీ..
1. జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని కనీసం గంటకు 10 కిలోమీటర్లు తగ్గించాలి. దాని వల్ల రోజువారీ చమురు వినియోగం రోజూ 2.9 లక్షల బ్యారెళ్లు తగ్గుతుంది.
2. సాధ్యమయ్యే చోట వారంలో మూడు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలి. దాని వల్ల రోజుకు 1.7 లక్షల బ్యారెళ్ల చమురు ఆదా అవుతుంది. అంటే ఆ మూడు రోజుల్లో మొత్తం 5.1 లక్షల బ్యారెళ్ల చమురు వినియోగాన్ని తగ్గించవచ్చు.
3. నగరాల్లో ఆదివారం కార్లన్నింటినీ బంద్ చేయాలి. దీంతో ఆ రోజు 3.8 లక్షల బ్యారెళ్ల చమురును ఆదా చేయవచ్చు.
4. ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ప్రజలు వాడుకునేలా చార్జీల ధరలను తగ్గించాలి. నడక, సైక్లింగ్ ను ప్రోత్సహించాలి. దాని వల్ల ప్రతి రోజూ 3.3 లక్షల బ్యారెళ్ల చమురును వాడాల్సిన అవసరం ఉండదు.
5. పెద్ద నగరాల్లో ప్రత్యామ్నాయ ప్రైవేట్ కార్ల వ్యవస్థను తీసుకురావాలి. దీంతో రోజుకు 2.1 లక్షల బ్యారెళ్ల చమురు ఆదా అవుతుంది.
6. కార్ షేరింగ్/పూలింగ్ ను విరివిగా వాడుకలోకి తీసుకురావాలి. దాని వల్ల రోజూ 4.7 లక్షల బ్యారెళ్ల చమురును ఆదా చేయడానికి వీలవుతుంది.
7. సరుకు రవాణ, డెలివరీ కోసం సమర్థవంతమైన డ్రైవింగ్ వ్యవస్థలను ప్రోత్సహించాలి. దాని వల్ల రోజూ 3.2 లక్షల బ్యారెళ్ల చమురు వినియోగం తగ్గుతుంది.
8. సాధ్యమయ్యే చోట విమానాలకు బదులు హై స్పీడ్ నైట్ ట్రైన్ల వినియోగాన్ని పెంచాలి. దీంతో రోజూ 40 వేల బ్యారెళ్ల చమురును ఆదా చేయవచ్చు.
9. ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పుడు బిజినెస్ పనుల కోసం విమానాల్లో వెళ్లడాన్ని తగ్గించాలి. దాని వల్ల రోజుకు 2.6 లక్షల బ్యారెళ్లను ఆదా చేయవచ్చు.
10. విద్యుత్ లేదా అంతకన్న సమర్థవంతమైన రవాణా వ్యవస్థల వినియోగాన్ని ప్రోత్సహించాలి. దీంతో ఒక్కరోజులో లక్ష బ్యారెళ్ల చమురు వినియోగం తగ్గుతుంది.