Tirumala: తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్తులు.. అలిపిరి వ‌ద్ద భారీగా ట్రాఫిక్ జాం

huge traffic jam at alipiri checkpost

  • క‌రోనా త‌గ్గుద‌ల‌తో పెరిగిన భ‌క్తుల సంఖ్య‌
  • ఆదివారం సెల‌వు నేప‌థ్యంలో ఒక్క‌సారిగా పెరిగిన ర‌ద్దీ
  • సొంత వాహ‌నాల్లోనే తిరుమ‌ల‌కు వ‌స్తున్న భ‌క్తులు 
  • ఫ‌లితంగా అలిపిరి వ‌ద్ద‌ భారీ ఎత్తున నిలిచిన‌ ట్రాఫిక్‌

తిరుమల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నం కోసం భ‌క్త‌కోటి పోటెత్తింది. క‌రోనా విస్తృతి బాగా త‌గ్గిపోవ‌డం, అదే స‌మయంలో ఆంక్ష‌లు కూడా పూర్తిగా స‌డ‌లిపోవ‌డంతో నెల‌ల త‌ర‌బ‌డి వెంక‌న్న ద‌ర్శ‌నం కోసం వేచి చూస్తున్న భ‌క్తులు క్ర‌మంగా తిరుమ‌ల బాట ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో శ‌నివారం తిరుమ‌ల‌కు వ‌చ్చేవారి సంఖ్య ఒక్క‌సారిగా పెరిగిపోయింది. సాధార‌ణ దినాల్లోనే వారాంతాల్లో వెంక‌న్న ద‌ర్శ‌నానికి భారీ సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు క‌రోనా నేప‌థ్యంలో బాగా గ్యాప్ రావ‌డంతో ముందు రోజు శుక్ర‌వారం హోలీ, త‌ర్వాతి రోజు ఆదివారం కావ‌డంతో శ‌నివారం ఒక్క‌సారిగా తిరుమ‌ల‌కు ర‌ద్దీ పెరిగిపోయింది. క‌రోనా ఎంత త‌గ్గినా..ఎవ‌రి జాగ్ర‌త్త‌ల్లో వారు ఉంటున్న నేప‌థ్యంలో సొంత వాహ‌నాల్లోనే తిరుమ‌ల‌కు చేరుకునేందుకు భ‌క్తులు అధిక ప్రాధాన్య‌మిస్తున్నారు. 

ఈ క్ర‌మంలో శనివారం తిరుమ‌ల‌కు బ‌య‌లుదేరిన‌వారిలో మెజారిటీ శాతం సొంత వాహ‌నాల్లోనే వ‌చ్చారు. దీంతో అలిపిరి వ‌ద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ జాం నెల‌కొంది. ప్ర‌తి వాహ‌నాన్ని చెక్ చేసి పంపాల్సి ఉన్న నేప‌థ్యం.. ఒక్కసారిగా పెరిగిన ర‌ద్దీ కార‌ణంగా అలిపిరి వ‌ద్ద వాహ‌నాల క్యూ చాంతాడంతగా పెరిగిపోయింది.

  • Loading...

More Telugu News