Drunk Driving: కొబ్బ‌రి బొండాల్లో మ‌ద్యం.. గ‌చ్చిబౌలి ప్ర‌మాదానికి ఇదే కార‌ణ‌మ‌ట‌!

drunken drive is the reason for gachibowli accident

  • హోలీకి ముందే మ‌ద్యం కొనుగోలు చేసిన రోహిత్‌
  • శుక్ర‌వారం ఫ్రెండ్ రూమ్‌లో పార్టీ
  • అక్క‌డే కొబ్బ‌రి బొండాల్లో మ‌ద్యం నింపిన వైనం
  • 8 కొబ్బ‌రి బొండాల‌తో ప్రిజ‌బ్ బార్‌కు రోహిత్‌, గాయ‌త్రి
  • ఆరు బొండాలు ఖాళీ, రెండింటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి ప‌రిధిలో చోటుచేసుకున్న కారు ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. మితి మీరిన వేగంతో దూసుకువ‌చ్చిన కారు అదుపు త‌ప్ప‌డంతోనే ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు ఆస‌క్తిక‌ర అంశాన్ని వెలికి తీశారు. మ‌ద్య‌పాన‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని తేల్చిన పోలీసులు.. అందులోనూ కొబ్బ‌రి బొండాల్లో నింపుకున్న మ‌ద్య‌మే ఇద్దరి ప్రాణాల‌ను తీసింద‌ని నిర్ధారించారు.

పోలీసుల ద‌ర్యాప్తుల్లో వెల్ల‌డైన వివ‌రాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి గ‌చ్చిబౌలి ప‌రిధిలోని ఎల్లా హోటల్ మెయిన్ గేటు వ‌ద్ద అతి వేగంగా దూసుకువ‌చ్చిన కారు అదుపు త‌ప్పి.. రోడ్డు మధ్య‌లో చెట్ల‌కు నీళ్లు పోస్తున్న కార్మికురాలు మ‌హేశ్వ‌రిని ఢీకొట్టిన త‌ర్వాత బోల్తా కొట్టింది. కారులో ఉన్న యూట్యూబ‌ర్ గాయ‌త్రి కారు అద్దాలు ప‌గ‌ల‌డంతో రోడ్డు మీద ప‌డిపోయింది. డ్రైవ‌ర్ సీట్లోని రోహిత్ సీట్ల మ‌ధ్య ఇరుక్కుపోయాడు. మ‌హేశ్వ‌రి అక్క‌డికక్క‌డే చ‌నిపోగా.. గాయ‌త్రి, రోహిత్‌లను ఏఐజీ ఆసుప‌త్రిలో చేర్చారు. వీరిలో గాయత్రి చనిపోగా..రోహిత్ అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

హోలీ సంద‌ర్భంగా జంట న‌గ‌రాల్లో మ‌ద్యం విక్ర‌యాలు మూత‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలుసుకున్న రోహిత్ అత‌డి స్నేహితులు ముందుగానే మ‌ద్యం కొనుగోలు చేసి దానిని కొబ్బ‌రి బొండాల్లోకి నింపుకున్నారు. శుక్ర‌వారం స్నేహితుడి గ‌దిలో రోహిత్‌, గాయత్రిలు మ‌రో ఐదుగురితో కలిసి పార్టీ చేసుకున్నారు. 

పార్టీ అనంత‌రం మ‌ద్యంతో నింపుకున్న‌ 8 కొబ్బ‌రి బొండాల‌ను కారులో పెట్టుకుని ప్రిజ‌బ్ ప‌బ్‌కు వెళ్లారు. అక్క‌డ ఆరు బొండాల‌ను ఖాళీ చేసిన అనంత‌రం రోహిత్, గాయ‌త్రిలు కారులో బ‌య‌లుదేరారు. మ‌ద్యం మ‌త్తులో మితి మీరిన వేగంతో కారును దూకించిన రోహిత్ దానిని అదుపు చేయ‌లేక‌పోయాడు. ఫ‌లితంగానే ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదం అనంత‌రం కారులో తాగ‌కుండా వ‌దిలేసిన మ‌రో రెండు మ‌ద్యం కొబ్బ‌రి బొండాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News