Tamilisai Soundararajan: మల్లు స్వరాజ్యం భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు
- భౌతిక కాయం ప్రస్తుతం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో..
- మల్లు స్వరాజ్యం సాహసం ఎందరికో స్ఫూర్తి: తమిళిసై
- ఆమె పేదల కోసం పోరాడారు: ఎర్రబెల్లి
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె భౌతిక కాయం ప్రస్తుతం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఉంది. ఆమెకు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం సాహసం ఎందరికో స్పూర్తి అని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, ఎంబీ భవన్లో మల్లు స్వరాజ్యం భౌతిక కాయానికి మంత్రి ఎర్రబెల్లి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి నివాళులు అర్పించి మాట్లాడారు. ఆమె పేదల కోసం పోరాడారని ఎర్రబెల్లి అన్నారు.
ఆమె మరణం దేశానికే తీరని లోటు అని చెప్పారు. మల్లు స్వరాజ్యం పేరిట పుస్తకాలు, సినిమాలు రావాలని ఆకాంక్షించారు. పేదల కోసం మల్లు స్వరాజ్యం వీరోచిత పోరాటాలు చేశారని కోదండరాం అన్నారు. రాజకీయాలు అంటే వ్యాపారం కాదని, ప్రజలకు శక్తినిచ్చే ఆయుధమని చాటి చెప్పారని అన్నారు. ఆమె పోరాటాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.
మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని కాసేపట్లో నల్లగొండకు తరలిస్తారు. అక్కడి పార్టీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహిస్తారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తారు. మల్లు స్వరాజ్యం చివరి కోరిక మేరకు భౌతిక కాయాన్ని కాలేజీకి ఇవ్వనున్నట్లు ఇప్పటికే ఆమె కుటుంబీకులు ప్రకటించారు.