Jagga Reddy: భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ నాతో మాట్లాడటం లేదు: పదవుల కోత అనంతరం జగ్గారెడ్డి స్పందన
- నాతో మాట్లాడేందుకు భయపడుతున్నారు
- ఢిల్లీకి రావాలని నాకు పిలుపు రాలేదు
- పదవుల కోత విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటున్నానన్న జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం ముదురుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పార్టీలోని కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన అసహనాన్ని పలుమార్లు బహిరంగంగానే వెళ్లగక్కారు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డికి ఉన్న బాధ్యతల్లో కోత విధించారు.
ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ లోక్ సభ స్థానాలతో పాటు మహిళా కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, ఇతర సంఘాల ఇన్ఛార్జి బాధ్యతలను ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ రేవంత్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు తాజా అంశాలపై అధిష్ఠానంతో మాట్లాడేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్లారు.
మరోపక్క, ఢిల్లీకి రావాలని తనకు ఇంతవరకు ఎలాంటి పిలుపు రాలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే అనుకుంటున్నానని తెలిపారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని తానెప్పుడూ సమర్థిస్తానని చెప్పారు. తప్పు, ఒప్పుల గురించి మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉంటుందని అన్నారు. పదవుల కోత విషయాన్ని కూడా తాను స్పోర్టివ్ గా తీసుకుంటానని చెప్పారు.