Maharashtra: ఉద్ధవ్‌కు ఈడీ షాక్.. థాకరే బావ ఆస్తుల జప్తు
- థాకరే బావ శ్రీధర్ కంపెనీలపై ఈడీ గురి
- 11 ఫ్లాట్లు సహా రూ.6 కోట్ల విలువైన ఆస్తుల సీజ్
- శివసేనపై బీజేపీ కక్షసాధింపేనంటూ విశ్లేషణలు
శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే థాకరే కుమారుడి స్నేహితులకు సంబంధించిన ఇళ్లలో ఆదాయపన్ను శాఖ సోదాలు చేయగా.. తాజాగా థాకరే బావ శ్రీధర్ పటంకర్‌కు చెందిన రూ.6 కోట్ల విలువ చేసే ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసింది. ఈడీ సీజ్ చేసిన ఆస్తుల్లో 11 ఫ్లాట్లున్నాయి.
శ్రీధర్ పటంకర్‌కు చెందిన కంపెనీకి థానే పరిధిలోని నీలాంబరి ప్రాజెక్టులో 11 ఫ్లాట్లున్నాయి. వీటితో పాటు శ్రీధర్ పటంకర్‌కు చెందిన మరిన్ని ఆస్తులు.. మొత్తం రూ.6 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకుందన్న విషయంపై వివరాలు తెలియరాలేదు.
కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేనపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కక్షసాధింపులకు పాల్పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ తాజా జప్తు శివసేన, బీజేపీల మధ్య మరింత దూరాన్ని పెంచనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.